రవీంద్రభారతి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కథా ప్రక్రియ పరంపరగా సాగాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు. ఆదివారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో గోదావరి ప్రచురణల ఆధ్వర్యంలో కొత్త రచయితలు ప్రవల్లిక రచించిన ‘చెత్త కథలు’, మహేష్‌ పొలోజు రచించిన ‘మనసు నేసిన కథలు’ పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మామిడి హరికృష్ణ పుస్తకాలను ఆవిష్కరించి రచయితలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ రచయితలు కథా ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. యువ సాహితీవేత్తలు కొత్తరకమైన కథలు రాయాలని చెప్పారు. ప్రముఖ యాంకర్‌ ఝాన్సీ మాట్లాడుతూ కథలు రాసేవాళ్లు ఉండాలంటే కథలు చదివే వాళ్లు ఉండాలన్నారు. కార్యక్రమంలో పలువురు యువ రచయితలు పుస్తక రచయితలను సత్కరించి అభినందించారు.