విజయవాడ కల్చరల్‌,ఆంధ్రజ్యోతి:  సుమధుర కళాని కేతన్‌, హాస్యనాటిక పోటీలు పీబీ సిద్ధార్థ  కళాపీఠం సౌజన్యంతో శుక్రవారం ప్రారంభమయ్యాయి.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ, ఆనందానికి హాస్యంకావాలని, హాస్యం ఉంటే జీవిత మంతా సుఖంగా ఉంటుందన్నారు. హాస్యానికి ప్రాధ్యాతనిస్తూ సుమధుర కళానికేతన్‌ పరిషత్‌లు హాస్య నాటికలు నిర్వహించటం అభినందనీయ మన్నారు. ప్రముఖ రంగస్ధల, సినీ దర్శకుడు విద్యాసాగర్‌ మాట్లాడుతూ హాస్యం అపహాస్య మవుతోంది. తస్మాత్‌ జాగ్రత్తా అని ఆరోగ్యమైన హాస్యాన్ని కాపాడేందుకు సుమధుర ఎంతో కృషి చేస్తుందన్నారు. నటుడు కోటా శంకరరావు, రావికొండలరావు మాట్లాడుతూ  హాస్యానికి చిరునామా జంధ్యాల అని, ఆయన వారసుడొకరు రావాలని కోరారు.
శనగల కబీర్‌దాస్‌ స్మారక పురస్కారం...
ప్రముఖ రంగస్ధల సినీనటుడు, దర్శకులు విద్యాసాగర్‌కు సుమధుర కళానికేతన్‌ కుటుంబం కబీర్‌దాస్‌ స్మారక పురస్కారాన్ని అందించి సత్కరిం చింది. ముందుగా సీపీ గౌతమ్‌సవాంగ్‌కు ఆత్మీయ సత్కారం చేశారు.కార్యక్రమంలో పీబీ సిద్ధార్థ అకా డమి అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, ఎం.సి.దాస్‌, డాక్టర్‌ మురళీకృష్ణ, దొంతిరెడ్డి వేమారెడ్డి, సామంతపూడి నరసరాజులు పాల్గొన్నారు.
నవ్వులు పండించిన నాటికలు...
తొలిరోజు ప్రదర్శించిన హాస్యనాటికలు ప్రేక్షకలోకంలో నవ్వులు పండించాయి. నగరానికి చెందిన గీతాంజలి థియేటర్‌ ఆర్ట్స్‌ ప్రదర్శించిన ‘తేలుకుట్టిన దొంగలు’ నాటిక కడుపుబ్బా నవ్వించింది. 
బి.వి.శ్యామ్‌ప్రసాద్‌ రచనకు, వడ్డాది సత్యనారాయణ దర్శకత్వంలో ఈ నాటిక సాగింది. తదుపరి హైదరాబాద్‌కు చెందిన పాప్‌ కార్న్‌ థియేటర్‌ ప్రదర్శించిన దావత్‌ నాటిక కడుపుబ్బా నవ్వించింది. తిరువీర్‌ రచన దర్శకత్వంలో ప్రదర్శించారు. చివరిగా శ్రీకాకుళంకు చెందిన మిత్ర సాంస్కృతిక సమితి బృందం ప్రదర్శించిన ‘వెతకండి బాబోయ్‌ వెతకండి’ నాటికకు విశ్వనాఽథగణపతి కథను అందించగా రవితాయ్‌ దర్శకత్వం వహించారు.