ఆచార్య ఘంటా చక్రపాణి, చైర్మన్‌, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ పరిశోధనా గ్రంథం ‘తెలంగాణ సాహిత్య వికాసం 1900-1940 వరకు’ చారిత్రక పరిశోధనలో వచ్చిన అత్యంత ప్రామాణిక, సైద్ధాంతిక గ్రంథమని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఆచార్య ఘంటా చక్రపాణి అభివర్ణించారు. దోమలగూడ ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలోని భాగ్యరెడ్డి వర్మ ప్రాంగణం, సినారె వేదికపై ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్‌ పరిశోధనా గ్రంథం ‘తెలంగాణ సాహిత్య వికాసం’పై సాహిత్య సమాలోచన చర్చ గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చే సిన ఘంటా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యం, సంస్కృతిపై వివక్ష ఎక్కువగా ఉన్న 1990 దశకంలో తెలంగాణ సాహిత్యాన్ని పరిశోధనాంశంగా తీసుకోవడం గొప్ప విషయమని అన్నారు. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన తొలి గ్రంథం సురవరం ప్రతాపరెడ్డి ‘గోల్కొండ కవుల సంచిక’ అయితే, రెండో గ్రంథం కె. శ్రీనివాస్‌ పరిశోధనా గ్రంథం ‘తెలంగాణ సాహిత్య వికాసం’ అని అన్నారు. చాలా మంది మార్కెట్‌ కోసం చరిత్ర పుస్తకాలు రాస్తున్నారని, అది మంచిది కాదని హితవు పలికారు. 
 
ఇష్టమైన గ్రంథం తెలంగాణ సాహిత్య వికాసం : ఈటల
గౌరవ అతిథిగా విచ్చేసిన ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ ‘తెలంగాణ సాహిత్య వికాసం’ తనకు ఇష్టమైన గ్రంథమని, దానిపై జరుగుతున్న చర్చకు హాజరుకావడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరుగుతున్న ప్రతి పుస్తక ప్రదర్శననూ తాను సందర్శిస్తున్నట్లు చెప్పారు. ‘ఇవాల్టి పిల్లలకు కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, టెలివిజన్‌లు ఉంటే చాలు. పుస్తకాలు చదివేవారు ఎవరున్నారు అని ఓ సందర్భంలో జూలూరు గౌరీశంకర్‌ని అడిగాను. అది నిజమే కానీ మన చరిత్రను మనం తెలుసుకోడానికి, భావితరాలకు తెలపడానికి ఇదొక ప్రయత్నమని ఆయన చెప్పారు. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణమైనా ఓ అడుగుతో మొదలవ్వాలని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా పుస్తక ప్రదర్శన నిర్వహణ గొప్ప ప్రయత్నం. మనిషి ఒత్తిడికి విరుగుడుగా పుస్తక పఠనాన్ని అలవర్చుకుంటున్నాడు. పుస్తకరూపంలో ప్రేమను కోరుకుంటూ ఇక్కడికి వస్తున్న వారిని చూస్తుంటే ఆనందంగా ఉంది.’’ అన్నారు. 
 
15 ఏళ్ల క్రితం చేసిన పరిశోధన : కె. శ్రీనివాస్‌
ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం చేసిన పరిశోధన ‘తెలంగాణ సాహిత్య వికాసం’ అన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రయాణం ఎక్కడ మొదలైందని చెప్పడం కష్టమని అన్నారు. తెలంగాణ ఉద్యమం చరిత్ర నిర్మించుకున్న ఉద్యమం అని అన్నారు. దేవులపల్లి రామానుజరావు చనిపోతే పత్రికల్లో చిన్నవార్త కూడా ఎందుకు రాలేదు అన్న ఆలోచన నుంచి తెలంగాణ సాహిత్య వికాసంపై పరిశోధన మొదలైందని వివరించారు. అద్భుతమైన విశ్లేషణతో వచన రూపంలో సాగే రచన ఈ పరిశోధనాగ్రంథమని చరిత్ర అధ్యయనకారులు కుర్రా జితేంద్రబాబు అన్నారు. సభాధ్యక్షత వహించిన సంగిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యం ఎలా ఎదుగుతూ వచ్చిందో ఈ గ్రంథం వివరిస్తుందని అన్నారు. తెలుగు యూనివర్సిటీ ఆధ్యాపకులు జి. బాలశ్రీనివాస మూర్తి మాట్లాడుతూ తెలంగాణ సాహిత్య వికాసం గ్రంథం ఓ సమాచార సాగరం.. ఓ సమాచార సర్వస్వం అని కొనియాడారు. కార్యక్రమ సమన్వయకర్తగా కవి రాపోలు సుదర్శన్‌, జూలూరు గౌరీశంకర్‌, సాంస్కృతిక సారధి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత  దేవిప్రియను బుక్‌ ఫెయిర్‌ నిర్వాహకులు సత్కరించారు.