ఆ బాధ్యత సాహిత్య విమర్శకులదే

శతజయంతి సదస్సులో 

సాహితీవేత్త కేతు విశ్వనాథరెడ్డి

చెన్నై, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): అనేక కారణాలతో మంచి రచయితలైన ధనికొండ హనుమంతరావు వంటి వారిని తెలుగు సాహితీలోకం విస్మరించడం దురదృష్టకరమని,  ఆయన రచనలను పరిచయం చేయాల్సిన బాధ్యత తెలుగు విమర్శకులపై ఉందని ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. ‘క్రాంతి ప్రెస్‌’ అధినేత, ప్రముఖ పత్రికా సంపాదకులు, నవల, నాటక, అనువాద రచయిత ధనికొండ హనుమంతరావు శతజయంతి జాతీయ సదస్సు బుధవారం చెన్నైలోని మద్రాసు విశ్వవిద్యాలయం రజతోత్సవ ప్రాంగణంలో జరిగింది. విశ్వవిద్యాలయం తెలుగుశాఖ, న్యూఢిల్లీలోని సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగుశాఖాధ్యక్షుడు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో భాగంగా ధనికొండ రచనలు ‘వాత్స్యాయన కామసూత్రాలు’, ‘అభిసారిక’ పుస్తకాలను ముఖ్య అతిథి నల్లి కుప్పుస్వామిశెట్టి ఆవిష్కరించారు. తొలి ప్రతులను సాహితీ విమర్శకులు వీఏకే రంగారావు అందుకున్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్‌ ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో కేతు విశ్వనాథరెడ్డి కీలకోపన్యాసం చేశారు. ‘‘ధనికొండ శతజయంతి వేడుకల సందర్భంగా ఆయన రచనలకు 21 సంపుటాలుగా కుటుంబీకులు ముద్రణ రూపం కల్పించడం అభినందనీయం. ధనికొండ తన రచనలలో మనోవిజ్ఞానానికి, లైంగిక విజ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు రచించారు’’ అని  కేతు విశ్వనాథరెడ్డి వివరించారు. ధనికొండ సాహిత్యం గురించి ఆనాటి విమర్శకులు అంతగా పట్టించుకోలేకపోవడం వల్లే ఆయన రచనలు మరుగునపడ్డాయని, ఈ విషయంలో నాటి సాహితీ విమర్శకుల పట్ల జాలిగా ఉందని వ్యాఖ్యానించారు. జనానికి ప్రయోజనకరమైన రచనలెన్నో చేసినా.. దురదృష్టవశాత్తూ ధనికొండను బూతు రచయితగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ధనికొండ సాహిత్యంపై సమగ్ర పరిశోధనలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యంగా ఆయన రచనలను పరిచయం చేయాల్సిన బాధ్యత తెలుగు విమర్శకులపై ఉందని విశ్వనాథరెడ్డి అన్నారు. మధ్యతరగతి జీవితాల్లోని ఆర్థిక, సామాజిక పరిస్థితులు, మానవ సంబంధాల్లోని సంక్షోభం ధనికొండ రచనల్లో కనిపిస్తాయని ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు కె.శ్రీనివాస్‌ అన్నారు. దురదృష్టవశాత్తూ ఆయన రాసిన లైంగిక రచనలనే గుర్తించారన్నారు. ఏడాదిగా జరుగుతున్న శతజయంతి వేడుకల్లో భాగంగా ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర కక్ష్యలోకి ధనికొండ రచనలు ప్రవేశించడానికి ఆయన కుటుంబం, అభిమానులు చేసిన కృషి ఫలించినట్లు భావిస్తున్నానని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.