కానరాని తీరాలకు 
‘కూచిపూడి కలహంస’
కొవిడ్‌తో శోభానాయుడు కన్నుమూత
ఉపరాష్ట్రపతి వెంకయ్య  సీఎం జగన్‌, చంద్రబాబు, పవన్‌ నివాళి

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యులు, పద్మశ్రీ పురస్కా ర గ్రహీత శోభానాయుడు(65) ఇకలేరు. కొంతకాలం గా మెదడు సంబంధిత సమస్య, కొవిడ్‌తో బాధపడుతున్న ఆమె ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి 1.40 గంటలకు 
తుదిశ్వాస విడిచారు. ఆమె అసలు పేరు శోభాదేవి. 5 దశాబ్దాల కిందట ఫెమీనా మేగజైన్‌ ఇంటర్వ్యూ ద్వారా శోభానాయుడిగా గుర్తింపు పొందారు. ఆమె స్వస్థలం విశాఖ జిల్లా అనకాపల్లి. తల్లితండ్రులు 
వెంకన్ననాయుడు, సరోజినీదేవి. శోభానాయుడు భర్త, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అర్జునరావు ఉమ్మడి ఏపీ సీఎస్‌గా పనిచేశారు. కూతురు సాయి శివరంజని(అంజు) తల్లి వద్దే కూచిపూడిలో తర్ఫీదు పొందుతున్నారు. శోభ ఐదేళ్ల వయసులో రాజమండ్రిలోని శాస్త్రీయ నృత్యగురువు పి.లక్ష్మణరెడ్డి వద్ద శిష్యరి కం చేశారు. ఆరవ ఏట తొలిసారి నృత్యప్రదర్శన ఇచ్చారు. అనంతరం చెన్నైలో ప్రసిద్థ నాట్యగురువు వెంపటి  చినసత్యం వద్ద శిక్షణ పొందారు. కూచిపూడి ప్రక్రియలో నవరసాలను ఒలికించి, అభినయంతో రూపకాన్ని రక్తికట్టించడంలో అందె వేసిన శోభానాయుడును కలహంసతో పోలుస్తారు. దాదాపు 20 నృత్యరూపకాలను రూపొందించారు. 

 

 వెంపటి చినసత్యం నృత్యదర్శకత్వంలోని ‘చండాలిక’ శోభానాయుడికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆ నృత్యరూపకాన్ని 700 సార్లు ప్రదర్శించారు. ఆమె వందకుపైగా సోలో నృత్యప్రదర్శనలకు దర్శకత్వం వహించారు. అమెరికా, రష్యా, సిరియా, బాగ్దాద్‌, టర్కీ, యూకే తదితర దేశా ల్లో ప్రదర్శనలు ఇచ్చారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక రంగ ప్రతినిధిగా మెక్సికో, క్యూబా, వెనెజులా దేశాల్లో పర్యటించారు. కొంతకాలం కిందట ఆమె మోకాళ్ల శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం నాట్యసాధన నూ కొనసాగించారు. శ్రీనివాస కూచిపూడి ఆర్ట్‌ అకాడమీని స్థాపించారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా 2001 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసింది. చెన్నై, కృష్ణగానసభ నుంచి ‘‘నృత్య చూడామణి’’ అవార్డు అందుకున్న తొలి కూచిపూడి కళాకారిణి శోభానాయుడు కావడం విశేషం. ఢిల్లీ, సంగీత, నాటక అకాడమీ అవార్డు, ఎన్టీఆర్‌ పురస్కారం, హంస అవార్డు, తెలుగు యూనివర్సిటీ పురస్కారం అందుకున్నారు. కొవిడ్‌తో మృతి చెందినందున బుధవారం మధ్యాహ్నం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో శోభానాయుడు అంత్యక్రియలను ఆస్పత్రి సిబ్బందే నిర్వహించారు. 

 

ప్రముఖుల నివాళి: శోభానాయుడి మృతి పట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం 
చేశారు. సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన నేత పవన్‌ సంతాపం తెలిపారు.