హైదరాబాద్: ప్రముఖ కవి దేవిప్రియ శనివారం తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన ఇవాళ ఉదయం 7.10 గంటలకు కన్నుమూశారు. ఆసుపత్రి నుంచి ఆయన పార్థివదేహాన్ని అల్వాల్‌లోని స్వగృహానికి తరలించారు. ఆయన మృతి పట్ల తెలుగు సాహితీ ప్రపంచం సంతాపం ప్రకటించింది. పలువురు సాహితీప్రముఖులు నివాళులు అర్పించారు.తెలుగు సాహితీలోకానికి దేవిప్రియగా సుపరిచితులైన షేక్‌ ఖాజా హుస్సేన్‌ కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు. నవంబరు 6న ఆస్పత్రిలో చేరారు. అప్పటికే దేవిప్రియ ఎడమ కాలికి ఇన్‌ఫెక్షన్‌ కావడంతో తొమ్మిదో తేదీన అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ఆరోగ్యం నిలకడగా ఉందనుకుంటున్న సమయంలో, రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో మరికొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 

 

ప్రస్తుతం దేవిప్రియ వెంటిలేటర్‌ మీద చికిత్స పొందుతున్నట్లు ఆయన కుమారుడు ఇవ సూర్య తెలిపారు. ఐదు దశాబ్దాల పాటు ప్రముఖ పాత్రికేయుడిగా, కవిగా దేవిప్రియ సేవలందించారు.ఉదయం, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఆయన కలం నుంచి జాలువారిన కార్టూన్‌ కవితలు ‘రన్నింగ్‌ కామెంట్రీ’ పాఠకలోకం మన్ననలు అందుకున్నాయి. దేవిప్రియ స్వస్థలం ఏపీ గుంటూరు జిల్లాలోని తాడికొండ. ‘అమ్మచెట్టు’, ‘నీటిపుట్ట’, ‘చేప చిలుక’, ‘తుఫాను తుమ్మెద’, ‘సమాజానంద స్వామి’, ‘గరీబు గీతాలు’, ‘గాలిరంగు’, ‘గంధకుటి’ తదితర కవితా సంపుటిలతో పాటు పలు రేడియో, రంగస్థల నాటికలు, సినిమా పాటలు రచించారు. ‘గాలిరంగు’ కవితా సంకలనానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది.