చెన్నై, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): దిగ్గజ సంగీత కళాకారుడు పట్రాయని సంగీతరావు తన 100వ పుట్టిన రోజును కుటుంబ సభ్యులు, శిష్యులు, చెన్నైలోని తెలుగు సంగీత ప్రముఖుల మధ్య శనివారం ఘనంగా జరుపుకొన్నారు. వల్సరవాక్కంలోని ఆయన నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో సత్యప్రియ రమణి శిష్య బృందం తమ గురువుకు వెండి పూలతో పాదపూజ చేసింది. సంగీత దర్శకులు సాలూరి వాసూరావు, నృత్య కళాకారులు మాధవపెద్ది మూర్తి, తెలుగు సంఘాల ప్రతినిధులు సంగీతరావును సన్మానించి శత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఘంటసాల సతీమణి సావిత్రమ్మ.. సంగీతరావు తనకు పెద్దన్నయ్యలాంటివారని పేర్కొన్నారు. సినీ కళాకారుల్లో శ్రీపాద పినాకపాణి, బాలాంత్రపు రజనీకాంతరావు తర్వాత వందేళ్లు జీవించిన వ్యక్తి సంగీతరావే. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు స్వర సహచరుడిగా మూడు దశాబ్దాల పాటు సంగీత యానం చేసి, అలనాటి మహామహులైన సంగీత, సాహితీవేత్తలతో పనిచేశారు.