హైదరాబాద్: దేశంలో జరుగుతున్న బీభత్సాన్ని చురకలు అంటిస్తూ హాస్యం, వ్యంగ్యం మిళితం చేసి రచించిన నవల ‘గోధనం’ అని రచయిత్రి ఓల్గా అన్నారు. సీనియర్‌ పాత్రికేయుడు, ప్రముఖ రచయిత సతీష్‌చందర్‌ రచించిన గోధనం నవల ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో జరిగింది. ఏపీ సీఐడీ ఐజీ పీవీ సునీల్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఓల్గా పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ, నవల రాయడమే కష్టం, కాని ఆ కష్టాన్ని మనకు కనబడకుండా ఈ రచనను సతీష్‌చందర్‌ చేశారన్నారు. పాత్రను అద్భు తంగా మలిచి, మాటలు కూడా అద్భుతంగా రాశారన్నారు. బీభత్స అంశాన్ని చురకలు అంటిస్తూరాసిన తీరు హైలైట్‌గా సాగిందని పేర్కొన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడారు. సతీష్‌చందర్‌ మాట్లాడుతూ వర్తమాన రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రచన చేశానన్నారు. కవి, పరిశోధకుడు సన్నిధానం నరసింహ శర్మ మాట్లాడుతూ ఎవర్ని నిందించకుండా సంయమనంతో ఈ రచన చేశారన్నారు. ప్రధాన వక్తలుగా రచయిత్రి కుప్పిలి పద్మ, వ్యంగ్య రచయిత తెలిదేవర భానుమూర్తి పాల్గొన్నారు.