అమీర్‌పేట, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కమ్యూనిస్టు భావజాలంతో ప్రముఖ రచయిత్రి ఓల్గా రచనలు సమాజాన్ని ప్రభావితం చేశాయని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్‌ నందిని సిధారెడ్డి అన్నారు. యువ కళావాహిని ఆధ్వర్యంలో యువకళావాహిని గోపీచంద్‌ జాతీయ సాహితీ పురస్కారం - 2019ని రచయిత్రి ఓల్గాకు ప్రదానం చేశారు. అమీర్‌పేటలోని సారథి స్టూడియో ప్రివ్యూ థియేటర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందిని సిధారెడ్డి హాజరై మాట్లాడుతూ గోపీచంద్‌కు ఓల్గా సాహిత్య వారసురాలిగా అభిప్రాయపడ్డారు. సినిమా వ్యాపారం అయినప్పటికీ, సాహిత్యం ఎప్పటికీ వ్యాపారం కాబోదన్నారు. అటువంటి సాహిత్యానికి జవసత్వాలు అందిస్తున్న ఘనత రచయిత్రి ఓల్గాది అన్నారు. తన తండ్రితో ప్రేరణ పొందిన రచయిత్రి ఓల్గా సమాజ ప్రభావితానికి చేసిన రచనలు ఎంతో అద్భుతంగా ఉన్నాయన్నారు.

మనుషుల్ని అర్థం చేసుకోవడానికి మానవ సమాజంలో అసమానతలను అర్థం చేసుకోవడానికి ఓల్గా ప్రయత్నించారని పేర్కొన్నారు. తన రచనల్లో స్ర్తీ, పురుషుల పట్ల సమానత్వం కనబరుస్తూ చెప్పదలుచుకున్న విషయాలను సూటిగా చెప్పగలిగే మంచి రచయిత ఓల్గా అన్నారు. ఆమె అన్నివిధాలుగా గోపీచంద్‌ జాతీయ సాహితీ పురస్కారానికి అర్హురాలన్నారు. తనకు గోపీచంద్‌ జాతీయ పురస్కారం దక్కడంపై రచయిత్రి ఓల్గా సంతోషం వ్యక్తం చేశారు. యువ కళావాహిని వ్యవస్థాపకులు వైకే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు డాక్టర్‌ ఆవుల మంజులత అధ్యక్షత వహించారు. ఇందులో నాగేశ్వరరావు నాటక కళాపరిషత్‌ అధ్యక్షుడు సారిపల్లి కొండల్‌రావు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ పి.మృణాళిని, సినీ నటుడు త్రిపురనేని సాయిచంద్‌, తదితరులు ప్రసంగించారు. ముందుగా యువ కళావాహిని గోపీచంద్‌ జాతీయ సాహితీ పురస్కారం - 2019కి ఎంపికైన రచయిత్రి ఓల్గాను గజమాలతో సత్కరించి రూ. 25 వేల చెక్కును అందజేశారు.