చాగంటికి ‘దర్శనమ్‌’ ఆధ్యాత్మిక పత్రిక

‘గురు సత్కారం’లో మంత్రి హరీశ్‌ ప్రశంసలు

ఆబిడ్స్‌/హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ప్రవచన చక్రవర్తి.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త.. చాగంటి కోటేశ్వరరావు అక్షయ పాత్రలాంటి వారని, ఆయన ప్రవచనాలు విన్నకొద్దీ జ్ఞానం పెరుగుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ఆటో డ్రైవర్‌ నుంచి పండితుల ఇళ్ల దాకా ప్రతి ఇంట్లో వేకువజామునే సూర్యకిరణాలు పడినట్లుగా చాగంటి ప్రవచనాలు వినిపిస్తుంటాయని గుర్తుచేశారు. ‘దర్శనమ్‌’ ఆధ్యాత్మిక మాస పత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చాగంటి కోటేశ్వరరావుకు ‘గురుసత్కారం’ నిర్వహించారు. దర్శనమ్‌ పత్రిక నిర్వాహకులు మరుమాముల వెంకటరమణశర్మ అధ్యక్షతన ఆదివారం రాత్రి నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని లలిత కళాతోరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చాగంటికి స్వర్ణ కంకణం తొడిగి ఘనంగా సన్మానించారు. ‘శారదా జ్ఞాన పుత్ర’ గ్రంథాన్ని ఆవిష్కరించడంతో పాటు చాగంటికి ‘ధార్మికవరేణ్య’ బిరుదు ప్రదానం చేశారు. చాగంటికి చేసేది సత్కారం కాదు సత్కార్యం అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, పద్మవిభూషణ్‌ వరప్రసాద్‌ రెడ్డి, సినీ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి, సినీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రవచన చక్రవర్తి చాగంటే.. నేను ప్రవచన కిరీటినే: గరికిపాటి

తెలుగునాట ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరియడంలో చాగంటి కోటేశ్వరరావుదే కీలకపాత్ర అని ప్రముఖ ప్రవచనకారుడు, మహా సహస్రావధాని గరికిపాటి నరసింహారావు అన్నారు. ‘ప్రవచనాలు చెప్పడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో విధానం. చాగంటివారిది రక్తి కట్టించే విధానం. నాది రక్తం ఉప్పొంగించే విధానం. సమాజానికి రెండూ అవసరమే’ అన్నారు. ‘వారు మహానుభావులు.. వివాదము లేదిక నాకు వారితో..’ అని పద్యరూపంలో హృద్యంగా చెప్పారు. ‘విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఇద్దరూ మహర్షులే. ఇద్దరూ బ్రహ్మర్షులే. కానీ.. చాగంటి వారిది వశిష్ఠ గోత్రం, నాది విశ్వామిత్ర గోత్రం. కొంచెం తేడా ఉంటుంది. పైగా వారు ప్రవచన చక్రవర్తి. నా బిరుదం ప్రవచన కిరీటి. నేను బాణాలు వేస్తాను. నిస్సందేహంగా చక్రవర్తి వారే. వారే ధర్మరాజు. నేనే అర్జునుణ్ని. అర్జునుడు ఎంత వీరుడైనా చక్రవర్తి ధర్మరాజే. ఆ ధర్మరాజును గౌరవించడమే అర్జునుడికి ఆనందం’ అని ఇద్దరి స్వభావాల తేడాను గరికిపాటి వివరంగా చెప్పారు.