ఎన్నో కష్టాలకు ఎదురీది ఎదిగిన డాక్టర్‌ హరిప్రసాద్‌..

కేన్సర్‌ను జయించారు.. అధిక బరువుకు చెక్‌ పెట్టారు

ఆయన రాసిన ‘ఐ యామ్‌ పాజిబుల్‌’ పుస్తకావిష్కరణ సభలో

కొనియాడిన మహమూద్‌ అలీ, పలువురు వక్తలు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): సంకల్పం, మనోధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చనడానికి చక్కటి నిదర్శనం అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ అధ్యక్షుడు డాక్టర్‌ హరిప్రసాద్‌ అని వక్తలు కొనియాడారు. మనోనిబ్బరంతో కేన్సర్‌ (లుకేమియా)ను జయించిన ఆయన గొప్ప ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. ఎటువంటి సర్జరీలను ఆశ్రయించకుండా కేవలం మంచి జీవన శైలితో తన అధిక బరువుకు చెక్‌ పెట్టారని వివరించారు. జీవితంలో అనేక కష్టాలు, సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు. విద్యార్థిగా, క్రికెటర్‌గా, వైద్యుడిగా, ప్రేమికుడిగా, భర్తగా, తండ్రిగా వివిధ దశల్లో తన ప్రయాణానికి డాక్టర్‌ హరిప్రసాద్‌ అక్షర రూపమిచ్చారు.‘ఐ యామ్‌ పాజిబుల్‌’ పేరిట ఆయన రాసిన పుస్తకాన్ని శుక్రవారం ఒక హోటల్‌లో ఆవిష్కరించారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, అపోలో ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి, ఎండీ సంగీతారెడ్డి, భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌, బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీవీ సింధు, ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడు తేజవత్‌, సినీ నటి సంజన తదితరులు పాల్గొని డాక్టర్‌ హరిప్రసాద్‌ సేవలను కొనియాడారు.స్నేహితులు, సహ విద్యార్థులు, వైద్యులు, క్రికెటర్లు, వివిధ రంగాల నిపుణులు ఆయనతో తమకు ఉన్న సాన్నిహిత్యం, వివిధ రంగాల్లో ఆయన రాణించిన తీరును వివరించారు. ‘‘దార్శనికత కలిగిన వ్యక్తి గురించి వివరించే పుస్తకం ‘ఐ యామ్‌ పాజిబుల్‌’. సాధారణ విద్యార్థి నుంచి అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ ప్రెసిడెంట్‌గా ఆయన ఎదిగిన తీరును కళ్లకు కడుతుంది’’ అని చెప్పారు. పొగాకు వ్యసనానికి ఎలా గురయ్యారు, ఎలాంటి ప్రయత్నంతో అధిగమించగలిగారనే విషయాలను ఈ పుస్తకంలో రాశారని తెలిపారు. సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎదుర్కొన్నారని చెప్పారు. ధైర్యం కోల్పోకుండా మెరుగైన చికిత్స తీసుకుంటే కేన్సర్‌ నుంచి బయటపడవచ్చని, డాక్టర్‌ హరిప్రసాదే ఉదాహరణ అని మహమూద్‌ అలీ చెప్పారు.