గోల్డెన్‌ త్రెషోల్డ్‌లో ఇందిరా దేవి ఆడిటోరియం

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): సాంస్కృతిక రంగానికి సరికొత్త వేదిక సకల హంగులతో నేడు అందుబాటులోకి రానుంది. నగరం నడిబొడ్డున అడుగడుగునా హుందాతనం ఉట్టిపడే ప్రాంగణం పరిసరాల్లో రాకుమారి ఇందిరా దేవి హాల్‌ అనునిత్యం సాంస్కృతిక రవళితో కళాభిమానులను పులకింపచేయబోతోంది. ఆబిడ్స్‌లోని గోల్డెన్‌ త్రెషోల్డ్‌లో నాడు గోపాల్‌ క్లినిక్‌ పేరుతో ఏర్పడిన భవన సముదాయంలో రూపుదిద్దుకున్న ఆడిటోరియం విభిన్న కళలతో సందడిగా మారనుంది. గోల్డెన్‌ త్రెషోల్డ్‌ను కాస్త పరికించి చూస్తే నాలుగుతరాల మహత్తర సాంస్కృతిక వైభవం జాడలు కళ్లముందు కదలాడుతాయి. భారతకోకిలగా ప్రపంచమంతా కవితల కుహుకువలు వినిపించి మెప్పించిన అగ్రశ్రేణి స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు నివాసం మళ్లీ కళకళలాడనుంది. నూరేళ్లకు పైబడి ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం దాకా కళాకారులు, సాహితీ వేత్తలు, ఉద్యమకారులతో ఆ ప్రాంగణం సందడిగా ఉండేది. 1948లో నైజాం రాజ్యం విలీనం తర్వాత.., 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం తర్వాత గోల్డెన్‌ త్రెషోల్డ్‌ (బంగారు వాకిలి) రకరకాల ఒడిదుడుకుల పాలైంది.

 
విద్యావంతుల నెలవుగా, అచ్చమైన ప్రజా వైద్యశాలగా వికసించిన ఆ ప్రాంగణం విలాసాల వసతి గృహంగా మైసూర్‌ కే్‌ఫ్‌ వారి అద్దెతో హోటల్‌గా మారిపోయింది. జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాల వెల్లువ అనంతరం నాటి ప్రధాని ఇందిరమ్మ తెచ్చిన సమైక్యతా రాగంతో రాజీ ఒప్పందాలలో భాగంగా 1975 నాటికి యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వారి కేంద్ర కార్యాలయంగా మారింది. మహాత్మా గాంధీ సహా అక్కడ అడుగుపెట్టని నేత, కళాకారుడు లేనంతగా ప్రగతిశీల సంరంభంతో వినుతికెక్కిన ఆ ప్రాంగణం గత 20 ఏళ్లుగా కళావిహీనం అయిపోయింది.
 
పునర్‌వైభవం దిశగా...
దక్కనీ సాంస్కృతిక వారసత్వం, ప్రాశ్చాత్య జీవనశైలి, అక్షర రమ్యత గలిగిన సాహిత్య సౌరభం హైదరాబాద్‌లో గుభాళించేలా ఇందిరా ధన్‌రాజ్‌గిర్‌ పేరిట సభా మందిరం తయారైంది. మందిరం ఏర్పాటుకు సెంట్రల్‌ యూనివర్సిటీ వారికి 20 లక్షల నగదుతో పాటు పరిపరివిధాల సౌజన్యాన్ని అందించారు ఇందిర. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకునే చిన్న చిన్న సంస్థలకు, సమాజాలకు నామమాత్రపు రుసుంతో ఆహ్వానం పలికేలా ఆడిటోరియం సమాయత్తమైంది.
 
హైదరాబాదీ వారసత్వ కట్టడంగా ఖ్యాతిగల గోల్డెన్‌ త్రెషోల్డ్‌ ప్రాంగణంలో పాతరోజుల్లో గోపాల్‌ క్లినిక్‌గా పద్మజా అనేక్సర్‌ గా మారిన భవన సముదాయంలో ఇందిర పేరిట తాజా ఆడిటోరియం రూపొందింది. బుధవారం సాయంత్రం హవాయి గిటార్‌ నుంచి మంగళదాయకమైన సుస్వర భరిత వాద్య కచేరితో ప్రప్రథమ కార్యక్రమం రవళించబోతోంది. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి ముఖ్య అతిథిగా, ఇందిరా ధన్‌రాజ్‌ గిర్‌ ప్రత్యక్ష అతిథిగా ఆడిటోరియం ప్రాంగణాన్ని సకలకళలకు అనువైన నెలవుగా వైస్‌ చాన్సలర్‌ ప్రకటించనున్నారు.
 
ఇందిరాదేవి సాంస్కృతిక సంపన్న నేపథ్యం
175 ఏళ్ల రాచరిక వారసత్వ చరిత్రతో పాటు ఆధునిక కవితా ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వటంలో ముందుండే జ్ఞాన్‌ బాగ్‌ యజమాని... హైదరాబాదీ కులీనులలో మేటిగా పేరుపొందిన రాజా ధన్‌రాజ్‌ గిర్‌ బహదూర్‌, రాణి విజయరాజె ప్రమీలదేవిల కుమార్తె ఇందిర. 1930 ఆగస్టు 17న జన్మించిన ఆమె మాతృ భాష మరాఠి, పితృభాష ఉర్దూ. ఘోషామహల్‌ పరిసరాల్లోని పాన్‌ మండి ప్రాంతంలో 300 ఎకరాల జాగా నుంచి 8 ఎకరాలకు కుంచించుకుపోయిన రాచభవనంలో ఇప్పటికీ ఆమె నివసిస్తున్నారు. ఉగ్గు పాల వయసు నుంచి సారస్వత ప్రముఖులు, కవి పండితుల సాంగత్యంలో ఎదిగిన ఆమె బాల్యం నుంచి బహుభాషల విదూషిమనిగానే ఎదిగారు. మహబూబియా బాలికల పాఠశాలలో చదివారు. బొంబాయిలోని క్వీన్‌ మేరీ కళాశాలలో డిగ్రీ చదువుతో పాటు పలు భాషల్లో పండితురాలయ్యారు. రాజకుమారి ఇందిరాదేవి అపర కుబేరుల ఇంటి పుట్టినా సాహిత్యంపై మక్కువతో ఉద్దండ కవి పండితుడు గుంటూరు శేషేంద్ర శర్మతో జీవితం పంచుకున్నారు.