అన్నవరం దేవేందర్‌ ఇటీవల తెలంగాణ సాంస్కృతిక చిత్రణగా ‘ఊరి దస్తూరి’ పుస్తకాన్ని వెలువరిం చారు. అది యాభై ఏండ్ల కింది పల్లె సామాజిక సాంస్కృతిక జీవన వ్యవ హారాలను చర్చించింది. ఈ సంద ర్భంగా అన్నవరంతో ప్రముఖ రచయిత, సాహిత్య చరిత్రకారుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ పలకరింపు...

‘ఊరి దస్తూరి’ పేరిట నాలుగు దశాబ్దాల కిందటి విషయాలను సైతం కండ్లకు కట్టినట్లు నోస్టాల్జిక్గా చెప్పగలిగిండ్రు. ఇప్పుడు నగరాల్లో నివసిస్తున్న చాలామంది తమ ఊరిని మీ ‘ఊరి దస్తూరి’లో దర్శించు కున్నారు. దీనిపట్ల మీరెలా ఫీలవుతున్నారు.

గొప్పగా సంతృప్తి చెందాను. ‘ఊరి దస్తూరి’ రాసి మా ఊరి (పోతారం.ఎస్‌) ఋణం తీర్చుకున్నాను. ఈ కాలమ్‌ రాస్తున్న మూడేండ్లు నా మనసు మా ఊరి మీదనే తిరిగింది. పల్లె సంస్కృతి సంబంధాలు, ఎద్దు ఎవుసం, గుట్టలు, చెట్లు, బహుజన కులాల కళాత్మక జీవనదృశ్యాలను నలభై యాభై ఏండ్ల కిందకుపోయి అక్షరీకరించాను. ఈ పుస్తకం యాభై ఏండ్ల కింది పల్లె ఆత్మను పట్టిస్తుంది. నోస్టాల్జియాగా నెమరువేసిననే గానీ ఇదొక తెలంగాణ సాంస్కృతిక చిత్రణ.

మీరు సదువుకున్నదీ, నివసించిందీ ఎక్కవగా అర్బన్‌ ఏరియాల్లోనే. మరి కవిత్వంలోనూ వచనంలోనూ ఊరి జీవితాన్ని ఇంత బలంగా ఎలా చిత్రీకరించగలుగుతున్నారు?

ఊరు తల్లివేరు వంటిది. ఎవుసం విస్తరించిన మహావృక్షం. వృత్తుల కళాత్మక ఉత్పత్తితోనున్న సంబంధబాంధవ్యాలు నా నుంచి విడిపోలేదు. ఇంకా తడి తడిగానే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ పల్లె భాష, నుడికారం నన్ను చిన్నప్పటినుంచీ ఆకట్టుకున్నది. అందుకే అర్బన్‌, సెమీ అర్బన్‌ ఏరియాల్లో నివసిస్తున్నా నేను పల్లె మమకారాన్ని అట్లనే పదిలపరుచుకున్న. ప్రపంచీకరణకు స్థానికీకరణే విరుగుడు కనుక ఆ అస్తిత్వాన్నే బలంగా చిత్రించాను. ఎక్కడ నివసించినా నేను అంబాడిన నేల నాకు ఆలంబన. ‘ఊరి దస్తూరి’లో ఊరు బహుముఖంగా కనిపిస్తది. నేను రాసే భాష కూడా అట్లనే ఉంటది.

గ్లోబలైజేషన్‌ వల్ల ప్రపంచం కుగ్రామంగా మారిపోయి సాంకేతికతతో సమాచార సైబర్‌ విప్లవం విస్తరించిన ఈ కాలంలో యాభై ఏండ్లనాటి ‘ఊరి దస్తూరి’ ఇప్పటి తరం చదవుతారా ?

యాభై ఏండ్ల కింద ఊరి చరిత్ర సంస్కృతి ఇది. ఎంత దూరం అందకుండా ఎదిగినా- మనిషి పుట్టుక మూలాలు, చరిత్ర తెలుసుకోవల్సిన అవసరం ఉన్నది కదా..! ఈ ఊరి దస్తూరి పాత తరానికి ఒక పురా జ్ఞాపకంగా, కొత్త తరానికి తెలుసుకోవల్సిన తమ తాతల సాంస్కృతిక చరిత్రగా మిగిలిపోతుంది.

‘బువ్వకుండ’ పేరిట వృత్తి జీవితాన్ని దీర్ఘ కావ్యంగా తీసుకువచ్చిండ్రు. ఇప్పుడు గ్లోబలై జేషన్‌ కారణంగా కుండల స్థానంలో ప్లాస్టిక్‌ చేరింది. మనిషి పుట్టినప్పడు, సచ్చినప్పుడు నడుమ పెండ్లప్పుడు మాత్రమే యాదికచ్చే కుండల గురించి మట్టి బతుకుల గురించి వృత్తి జీవితం మీకు లేకున్నా ఎట్లా రాయగలిగిండ్రు?

మట్టి వృత్తితో సంబంధం లేకున్నా బంధుత్వ అనుబంధం ఉంటది కదా. బువ్వకుండల మూలాలు దొరికించుకొని పరిశీలించి, పరిశోధించి ‘బువ్వకుండ’ దీర్ఘ కవిత రాసిన. ప్రపంచీకరణ వల్ల కులవృత్తులన్నీ మార్పుకు లోనయ్యాయి. అయితే సమస్త వృత్తులు ఆధునీకరించుకోవాలి. కొత్త కొత్త ఉద్యోగాలు రాజకీయాలు వ్యాపారాల నిర్వహణకు కోసం టర్న్‌ కావల్సిందే. అయితే కవులు రచయితలు తాము ఎదిగి వచ్చిన మూలలను తల్లి వేర్లను శోధించుకోవాలి.