1980 జనవరిలో ఆంద్రె సఖాకోవ్‌ను గృహనిర్బంధంలో ఉంచారు. సార్త్రే దీన్ని వ్యతిరేకిస్తూ మాస్కోలో జరుగనున్న ఒలంపిక్‌ క్రీడల పోటీని బహిష్కరించే లేఖలో సంతకం పెట్టారు. ఆయన ఫిబ్రవరి 28న ‘గే పాయింట్‌’ అనే హోమోసెక్సువల్స్‌కు సంబంధించిన మాసపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘లార్క్‌’ పత్రిక రాబోయే సంచికకు గాను క్లెమెంట్‌, బర్నార్డ్‌ పిగ్వెద్‌తో చాలాసేపు మాట్లాడారు. ఫిబ్రవరి 4న జరిపిన వైద్య పరీక్షలను బట్టి ఆయన ఆరోగ్యం మెరుగుపడనూ లేదు, దిగజారనూ లేదు. ఆరోగ్యం ఎలా ఉన్నా, ఆయన ముఖంలో బాధ కానీ, దిగులు కానీ కనపడ లేదు. ఆయనలో జీవన ప్రీతి ఏ మాత్రమూ తగ్గలేదు. యువతులతో గంటల కొద్దీ వుత్సాహంగా మాట్లాడేవారు. ఒక రోజు నాకు గుర్తుంది-- పొద్దున్నే సూర్యుని ఉదయ కిరణాలు చదువుల గదిలో ఉన్న ఆయన ముఖం మీద పడుతున్నాయి. ‘అబ్బ! ఎంత బావున్నదీ పొద్దు!’ అన్నాడాయన ఆనందం పట్టలేక. ఆరోగ్యంపై తనవంతు శ్రద్ధ వహించేవారు. పైప్‌ తాగడం మానేశారు. మామూలుగానే మద్యం తక్కువ తాగేవారు. మేం ఎప్పుడైనా లంచ్‌కు బైటకు వెళ్ళినప్పుడు ఆర్డరు ఇచ్చిన వైన్‌లో సగం కూడా తాగకుండానే వదిలివేసేవారు. 

 

కానీ మార్చి నెలలో ఒక ఆదివారం ఉదయం ఆయన గదిలో కిందపడి ఉండటం ఆరలెట్టి (సార్త్రే దత్త పుత్రిక)  గమనించింది. ఆయన పీకల దాకా తాగి వున్నారు. మాకు తర్వాత తెలిసిందేమిటంటే- ఆయన తన స్నేహితురాళ్లయిన పలువురు యువతులతో విస్కీ, వోడ్కా బాటిల్స్‌ తెప్పించుకు న్నారు. వాటిని పుస్తకాల అల్మరాల వెనక దాచారు. ఆ ముందురోజు రాత్రి వాటిని తీసి తాగారు. ఆరలెట్టి, నేను కలిసి ఆ బాటిల్స్‌ దాచిన ప్రదేశాలన్నింటినీ పసిగట్టి ఖాళీ చేసాము. నేను ఆ యువతులందరికీ ఫోన్‌ చేసి ఇక మీదట ఆయన వద్దకు మందు బాటిల్స్‌ తేవద్దని చెప్పాను. సార్త్రేని కూడా తీవ్రంగా మందలించాను. ఆయనకు ఇంత హఠాత్తుగా  మందు మీద ఇదివరకటి ప్రీతి ఎందుకు జాగృతమైందో నాకు అర్థం కాలేదు. ఆ విషయమే ఆయన్ను అడిగితే, ‘‘తాగటం నీకు కూడా ఇష్టమే కదా’’ అని కొట్టిపారేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆయన్ను మానసికంగా ఇబ్బందిపెడుతున్నదని అనిపించింది. 
 
మార్చి 20 ఉదయం తొమ్మిదింటికి నేను సార్త్రేను నిద్ర లేపటానికి వెళ్లాను. మామూలుగా ఈ సమయానికి ఆయన ఇంకా మంచంమీదే దొర్లుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం మంచం అంచున కూర్చుని ఊపిరి అందనట్టు ఇబ్బంది పడుతున్నారు, కనీసం మాట కూడా పెగలటం లేదు. ఈ పరిస్థితి ఒకసారి అరలెట్టి సమక్షంలో కూడా వచ్చింది. కానీ వెంటనే తగ్గిపోయింది. అప్పుడాయన దాన్ని ‘‘ఏరోఫేజియా అటాక్‌’’ అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఉదయం ఐదింటి నుంచి కూడా ఇదే పరిస్థితి అట. కనీసం ఎవరినైనా పిలిచిచెప్పటానికి తలుపు దాకా కూడా వెళ్లలేకపోయాడట. నాకు భయం వేసింది. వైద్యుడికి ఫోన్‌ చేయటానికి ప్రయత్నించాను. కానీ ఫోను బిల్లు కట్టనందు వల్ల అది పని చేయడం లేదని తెలిసింది. నేను కిందకు పరుగెత్తి వెళ్లి సెక్యూరిటి గార్డు దగ్గర నుంచి సమీపంలోనే ఉన్న ఓ వైద్యుడికి ఫోన్‌ చేశాను. ఆయన వచ్చి సార్త్రే పరిస్థితి గమనించి పొరుగు అపార్టుమెంటు నుంచి ఎమర్జన్సీ సర్వీసుకు ఫోన్‌ చేశారు. వాళ్ళు ఐదు నిమిషాల్లో వచ్చారు. రక్తపరీక్ష చేశారు. ఒక గంటపాటు చికిత్స చేశారు. తర్వాత వీల్‌ చెయిర్‌ తీసుకు వచ్చారు. ఆయన్ను అందులో కూర్చోబెట్టి, పొడవాటి కారిడార్‌ గూండా తీసుకువెళ్లారు. ఒక వైద్యుడు చేత్తో సార్త్రే తలపైన ఆక్సిజన్‌ మాస్క్‌ పట్టుకున్నాడు. దాని నుంచి ఆయన శ్వాస తీసుకుంటున్నారు. ఆయన్ను వీల్‌చైర్‌తో సహా లిఫ్ట్‌లోకి తీసుకువెళ్లి కింద ఎదురుచూస్తున్న అంబులెన్సులోకి ఎక్కించారు.
 
ఆయన్ను ఏ హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారో నాకు అప్పటికి తెలీదు. కింద సెక్యూరిటీకి ఫోన్‌ చేసి చెప్తామన్నారు. నేను సార్త్రే గదికి తిరిగివెళ్లి స్నానాదికాలు పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి ఇక ఆయన గురించి చింతించనక్కర్లేదనుకున్నాను. అందుకే ఆ మధ్యాహ్నం నాకు ఉన్న లంచ్‌ అప్పాయింట్మెంట్‌ను కూడా రద్దు చేసుకోలేదు. ఆ రోజు సార్త్రే అపార్టుమెంటు తలుపు మూసి లంచ్‌కు వెళ్తున్నప్పుడు నాకు తెలీదు- ఆ తలుపు ఇక నాకు శాశ్వతంగా మూసుకుపోయిందని. సార్త్రే  చివరి రోజులు మరుసటిరోజు మధ్యాహ్నం వైద్యులు సార్త్రే శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ఆయన తీవ్రమైన జ్వరంతో హెచ్చు తగ్గులవుతూ అవస్థ పడుతున్నారు. జ్వర ప్రకోపంతో భ్రాంతిలో ఉన్నట్టు మాట్లాడారు. ఒకసారి అరలెట్టి వైపు చూస్తూ ఇలా అన్నారు: ‘‘నీవు చనిపొయ్యావు కదా? మరి, నీ దహన సంస్కారాలు ఎలా జరిగాయో చెప్పవూ? మనిద్దరమూ చనిపొయ్యాం కదా? ఆ కబుర్లాడుకొందాం. ఏమంటావ్‌?’’ తర్వాత, నేను వచ్చినప్పుడు నాతో, ‘‘నేను ప్యారిస్‌లో నా సెక్రటరీతో కలిసి భోజనం చేశాను,’’ అన్నారు. ఆ మాటలు విని నాకు బోలెడంత ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆయనకు ఎలాంటి సెక్రటరీలు లేరు. నా ఆశ్చర్యాన్ని చూసి- ఇక్కడి వైద్యుడు మంచివాడని, కారు ఇచ్చి పంపించి వెనక్కు తీసుకువచ్చాడనీ చెప్పారు. దారిలో ఎన్నో రోడ్లూ, శివార్లూ దాటుతూ వెళ్లామన్నారు. ‘‘మీకేదో కల వచ్చినట్లుంది’’ అన్నాను. ఆయన కోపంగా, ‘‘కాదు’’ అన్నారు. మరింక నేను మాటలు పొడిగించ లేదు. 
 
ఒకరోజు డాక్టర్‌ హావుజర్‌, మరి కొంత మంది వైద్యులు తమలో తాము మాట్లాడుకొంటూ వుండగా ‘యురేమియా’ అన్న పదం నా చెవిన పడింది. ఆయనను బతికించుకోలేమన్న సంగతి అప్పుడే అర్థమైంది. ....కొద్ది రోజుల్లో ఆయన ఒంటి మీదంతా గ్యాంగ్రీన్‌ వ్యాపించింది. చివరి రోజుల్లో మా మధ్య చాలా కబుర్లు నడిచేవి. ఒకసారి నాతో, ‘‘నా శవ సంస్కారం చేయటానికి చాలినంత డబ్బు నీ దగ్గర వుందా?’’ అన్నారు. నేను అలా మాట్లాడవద్దని సంభాషణను ఆసుపత్రి ఖర్చులవైపు మళ్లించాను. ఆయన జీవితపు చివరి సంవత్సరాల్లో ఆయన్ను ఎక్కువగా ఒత్తిడికి గురిచేసింది డబ్బు సమస్య ఒక్కటే! ఒకరోజు నా చేతిని పట్టుకుని ‘‘నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను,’’ అన్నారు. ఏప్రిల్‌ 14న నేను వచ్చేసరికి ఆయన నిద్రపోతున్నారు. కళ్లు తెరవకుండానే ఏదో అన్నారు. తర్వాత తన పెదవులను నా వైపుకు సాచారు.  నేను ఆయన పెదవులపైనా, చెంపలపైనా ముద్దుపెట్టుకున్నాను. ఏప్రిల్‌ 15 రాత్రి తొమ్మిది గంటలకు అరిలెట్టి ఫోన్‌ చేసింది. ‘‘అంతా అయిపోయింది,’’ అని చెప్పింది. అంతే.(సార్త్రే చివరి రోజుల గురించి ఆయన సహచరి సిమోన్‌ ద బొవా ఫ్రెంచిలో రాసిన, పాట్రిక్‌ ఒ’ బ్రియాన్‌ ఇంగ్లీషులోకి అనువదించిన, ‘ఫేర్‌వెల్‌ టు సార్త్రే’ రచన నుంచి కొన్ని భాగాలకు ఇది అనువాదం)
 
కన్నడానువాదం: విక్రమ విసాజి
తెలుగు అనువాదం: ఘట్టమరాజు, శివప్రియ
99640 82076