భూస్వామ్యయుగ భావజాలానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా కవి, రచయిత పోరాటం చేయక తప్పదు. సంఘటనలను కళాత్మకంగా ప్రతిబింబించడంతోనే రచయిత బాధ్యత తీరిపోదు. వాటిపై అతని వ్యాఖ్యానం ప్రధానం. ఆ వ్యాఖ్యానమే లేకుంటే ఆ రచన నిరర్థకమవుతుంది. అలా వ్యాఖ్యానించాలంటే ఒక సామాజిక తాత్వికత దృష్టి కావాల్సి వుంటుంది. రచనలో సామాజిక తర్కం స్పష్టం కావలసి వుంటుంది. అవగాహనా పరిమితులు రచయితను తప్పుదారి పట్టించినా, విప్లవ కావ్య వస్తువు నుంచి ఎవరూ తప్పించుకోలేని యథార్థం సాహిత్య ప్రపంచంలో స్థిరపడింది. ఇవి జ్వాలాముఖి సాహిత్య జీవనాన్ని నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలు. అందువల్లనే ఆయన తన కాలం కవులకే కాదు, రానున్న తరాలకు కూడా లక్ష్య నిర్దేశనం చేయగలిగారు.

 
‘అభిరుచులకు వర్గ ప్రయోజనాలుంటాయి. అభివ్యక్తి సోయగాలకు వర్గ ప్రయోజనాలుంటాయి. పద చిత్రాలకు ఖచ్చితంగా వర్గ అభీష్టాలుంటాయి’ కనుక ఏ పదాల వెనుక, ఏ నినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో గమనించి జాగ్రత్త పడమని సాహితీ లోకానికి, ప్రజలకు ఆయన ఒక చక్కని హెచ్చరిక చేశారు. పాలక వర్గ ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలుగా, అధికారంలో వున్నవారి అభిప్రాయాలే సర్వ శిరోధార్యాలుగా పరిణమించిన నేటి సాంఘిక, రాజకీయ వాతావరణంలో ఆయన చూపిన ఎరుక మనకో చరుపు. మన ప్రతిష్ఠ కన్నా మన యుగావసర పరిపూర్తి ముఖ్యం. దేశంలో ఈనాటి పరిస్థితి అనేక రకాలుగా దుర్భరంగా వుంది.
‘పునరుద్ధరణ వాదం’ రాజ్యాధికారం చెలాయిస్తోంది. ‘సంస్కరణ వాదం’ అవకాశవాదంలో కూరుకు పోయింది. నిజానికి ఈ రెంటిలో ఏదీ ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా నిర్వహించజాలదు. ఇది ఒక వంక ఫ్యూడల్‌ భావజాలాన్ని, మరో వంక సామ్రాజ్యవాద బానిస భావజాలాన్ని ప్రదర్శిస్తూ నిజమైన ప్రజా సంస్కృతిని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే రాజకీయ పోరాటాలు ఎంత నిర్దుష్టంగా, ఎంత నిష్ఠూరంగా సాగుతాయో సాంస్కృతిక పోరాటం కూడా అంత నిర్దుష్టంగాను అంత నిష్ఠూరంగాను సాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
 
‘అనుభూతులకు, అభిప్రాయాలకు, ఆవేశాలకు, ఆత్మీయతలకు, ఆర్ధ్రతలకు, మానవ సంబంధాలకు, విలువలకు, సంస్కృతీ సభ్యతలకు ఆస్కారం లేని యాంత్రిక ప్రవర్తన, లాభనష్టాల అంచనా, ఎగబడి సంపాదించుకునే (దోచుకునే) నైపుణ్యానికి పట్టం కట్టడం’ ఈ నాటి వాస్తవం. ప్రతివాడూ సరుకు, ప్రతి విషయం లాభం, ప్రతి సందర్భం కొనుగోలు కావడం ఈ పెట్టుబడిదారీ సమాజ వికృత స్వభావం. మనిషిని సమిష్టితత్వం నుంచి విడగొట్టి, ఒంటరిని చేసి, లాభాల మృగంగా మార్చడం, అవసరం తీరిపోగానే పనికిరాకుండా చేయటం గమనించి ఆయన చాలా వ్యాకుల పడ్డాడు. భాషా సంస్కృతులు కూడా ఆర్థిక ప్రయోజనాలకు భిన్నంగా మనజాలవు అని చెబుతూ ‘ఇంగ్లీషును ఒక భాషగా ఒక సాహిత్యంగా తెలుసుకోవడంలో ఎవరికీ అభ్యంతరం వుండనక్కర లేదు. కానీ దాన్ని మాతృభాషకు ప్రత్యామ్నాయంగా చేపట్టే విద్యా విధానాన్ని ప్రతిఘటించాలి’ అని ఆయన పిలుపు నిచ్చారు.
 
ప్రజలు గమనించవలసిన అంశం ఆయన ఎత్తి చూపారు. విదేశాలకు వెళ్ళే ఇంగ్లీషు చదువులు వేరు. ఈ దేశంలోనే వుంటూ, ఈ మట్టిని నమ్ముకుని బతికే వారి సంగతి ఏమిటి? అని ప్రశ్నిస్తూ ప్రజలు తమ నైసర్గికత నుండి తుంచివేయబడి, భాషా పరంగా పరాయీకరణ చెందితే, సంస్కృతి పరంగా తనదైన దానికి దూరమయితే ఈ దేశమే మిగలదు. అదే సామ్రాజ్యవాదులకు కావాలి’ అని రానున్న ప్రమాదాల్ని పసిగట్టారు.
 
‘ప్రజల మధ్య చైతన్యం, సమిష్టితత్వం లేకుండా చేయడం సామ్రాజ్యవాద సంస్కృతి’. విరుచుకుపడుతున్న ఈ సాంస్కృతిక దాడిని ఎదుర్కోవడం నేటి సాహితీ, సాంస్కృతిక రంగాల, ప్రధాన ప్రాథమిక కర్తవ్యంగా మారిపోయింది.ఉద్యమాలకు సంఘం జన్మస్థానం అయితే విప్లవం గమ్యస్థానం కావాలి. సంఘటిత శక్తితో, రాజకీయ విజ్ఞతతో, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఉద్యమిస్తున్న ప్రజలతో భావైక్యం చెందాలి! సాహితీ, సాంస్కృతిక రంగానికి ఇంతకు మించిన మార్గం మరొకటి లేదు. కళా సాహిత్యాల పరమప్రయోజనం అశాంత జీవితాలు కోరుకునే విస్తృత మార్పులకు ప్రోది చేయటమే పీడిత జనతా ఉద్యమాలకు తోడుగా, తోడ్పాటుగా నడవటమే అన్న సాహితీ సందేశాన్నందిన విప్లవ కవి జ్వాలాముఖి సందేశం మనకు మార్గదర్శకం కావాలి.
 
డా. యస్‌. జతిన్‌ కుమార్‌
‘నవోదయ’ సాంస్కృతిక సమాఖ్య
(నేడు జ్వాలాముఖి వర్ధంతి)