కొన్ని మీడియా సంస్థలు ఉగ్రవాదులుగా ప్రచారం చేస్తున్నాయి

370 నిర్వీర్యం.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

‘కశ్మీర్‌ బహిరంగ చెరసాల’ పుస్తకావిష్కరణలో

ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌ ప్రజలు సహృదయులని ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె.శ్రీనివాస్‌ అన్నారు. 1984లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా కశ్మీర్‌లో ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. భారత సైన్యం బాధించినప్పటికీ వారు ప్రేమతో ఉంటున్నారని పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు వారిని ఉగ్రవాదులుగా, రాళ్లురువ్వే నిరసనకారులుగా ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేయడం తనకు ఆశ్చర్యంతోపాటు భయాన్ని కలిగించిందని తెలిపారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రఖ్యాత కశ్మీరీ జర్నలిస్ట్‌ గౌహర్‌ గిలానీ రాసిన ‘కశ్మీర్‌ బహిరంగ చెరసాల’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కె.శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

గత కొంతకాలంగా కశ్మీర్‌ ప్రజలు పడుతున్న బాధలు, హింస మనకు అర్థం కావని, వారి జీవితాలను, కష్టాలను, అవమానాలను తెలుసుకుంటేనే వాటిని గ్రహించగలమని పేర్కొన్నారు. ప్రస్తుతం వారు చీకటి నిండిన సమయం నుంచి వెలుగు కోసం ఎదురుచూస్తున్నారన్నారు.గౌహర్‌ గిలానీ మాట్లాడుతూ.. కశ్మీర్‌ పౌరుడినైన తాను దక్షిణాది రాష్ట్రాలకు వచ్చినపుడు సురక్షితంగా ఉన్న భావన కలుగుతుందన్నారు. కానీ, కశ్మీర్‌లో గత 173 రోజుల నుంచి ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేవని, కశ్మీరీల బాధలు, మాటలు ప్రపంచానికి వినిపించకుండా ఉండేందుకు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలు పత్రికల సంపాదకులు జహీర్‌ అలీఖాన్‌, కె.శ్రీనివాసరెడ్డి, ఎన్‌.వేణుగోపాల్‌, బి.రమాసుందరి, డేవిడ్‌, సామాజిక కార్యకర్త సజయ, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య తదితరులు పాల్గొన్నారు.