అది బతికితేనే సంస్కృతి బతుకుతుంది

మాతృభాషను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి

 

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు

ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం ప్రారంభం


నెల్లూరు, జనవరి 21(ఆంధ్రజ్యోతి):‘‘సామాజిక పరిణామ క్రమంలో భాష ఒక కీలకమైన ఇరుసు లాంటిది. భాష సజీవ సమాజ దర్పణం. అలాంటి మాతృభాషను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కేంద్ర మానవ వనరుల శాఖమంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో కలసి అధ్యయన కేంద్రంలోని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉపరాష్ట్రపతి ఉపన్యసిస్తూ దేశంలోని అన్ని తెలుగు విద్యా విభాగాల్లో పరిశోధలను శక్తిమంతంగా, వినూత్నంగా ప్రోత్సహించడంతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల్లో జరగుతున్న పరిశోధనలపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా అధ్యయన కేంద్రం మార్గనిర్దేశం చేయాలని కోరారు.
 
అన్నంపెట్టే చదువులు నేర్చుకోవద్దని ఎవరూ చెప్పడం లేదని, దానికంటే ముందు మాతృభాష నేర్చుకోమని చెబుతున్నామన్నారు. ప్రస్తుత చదువులు, ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియల్‌ నిశాంక్‌ మాట్లాడుతూ తెలుగు అధ్యయన కేంద్రం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. నిపుణులు ఇచ్చిన నివేదికలోని అన్ని అంశాల అమలుకు కేంద్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.