గుండె సంబంధిత సమస్యలతో రామానుజయ్య మృతి

నేడు చింతల్‌లో అంత్యక్రియలు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌25 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సాహితేవేత్త, పద్యకవి, పండితుడు, దాశరథి సాహితీ పురస్కార గ్రహీత తిరునగరి రామానుజయ్య (76) ఇకలేరు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కాచిగూడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 11 గంటలకు కన్నుమూశారు. రామానుజయ్య స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బేగంపేట. ఆయన 1945 సెప్టెంబరు 24న జన్మించారు. తల్లిదండ్రులు జానకిరామక్క, మనోహర్‌. రామానుజయ్య భార్య భారతీదేవి. వీరికి ముగ్గురు కుమారులు. ఎంఏ తెలుగు పూర్తిచేసిన తిరునగరి చాలాకాలం పాటు ఆలేరు హైస్కూ ల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనంతరం తుంగతుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల తెలుగు బోధకుడిగా పనిచేసి 1999లో ఉద్యోగ విరమణ పొందారు. తిరునగరి సాహితీ ప్రస్థానం ‘బాలవీరశతకం’తో మొదలైంది. ఆపై పద్యం, వచనం, శతకం, గేయం తదితర సాహితీప్రక్రియల్లో సాహిత్య సృజన చేశారు. ఇరవైకి పైగా పుస్తకాలు రచించారు. ఇందులో ‘శృంగారనాయికలు’ ఖండకావ్యం, ‘కొవ్వొత్తి’, ‘వసంతం కోసం’, ‘అక్షరధార’, ‘తిరునగరీయం పద్య సంపుటి, ‘మాపల్లె’, ‘వాని-వాడు’, ‘ఉషోగీత’, ‘నీరాజనం’ పద్యకవిత్వం, ‘ప్రవాహిని’, ‘యాత్ర’ తదితర రచనలున్నాయి.

‘ఆలోచన’, ‘తిరునగరీయం’, ‘పద్యసౌరభం’, ‘లోకాభిరామాయణం’, ‘లోకాలోకనం’ శీర్షికలపేరుతో వివిధ సాహిత్య పత్రికలకు సుమారు వెయ్యికిపైగా విమర్శనా వ్యాసాలు రాశారు.కొన్ని హిందీ, ఆంగ్ల కవితలను తెలుగులోకి అనువదించారు. ఆయన రాసిన పలు గేయాలు, కవితలు ఆకాశవాణిలోనూ ప్రసారమయ్యాయి. తెలుగు, సంస్కృత భాషలపై సాధికారత కలిగిన తిరునగరి రామానుజయ్య 2003లో భోపాల్‌లోని అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళనంలో ‘భారత్‌భాష భూషణ్‌’ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఆటా సత్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, బీఎన్‌రెడ్డి సాహితీ అవార్డు, విశ్వసాహితీ ఉత్తమ పద్యకవి పురస్కారం, ఏపీ అధికార భాషా సంఘం సత్కారం, రాచమళ్ల లచ్చమ్మ స్మారక అవార్డు, శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం దాశరథి పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దాశరథి సాహితీ పురస్కారం పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో తిరునగరి సాహిత్య కృషిపై పరిశోధనలూ వెలువడ్డాయి. తిరునగరి మృతికి చరిత్రపరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు సంతాపం తెలిపారు. సోమవారం చింతల్‌లో తిరునగరి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు శ్రీనివాస్‌ తెలిపారు.