20-06-2018: ఐక్య రాజ్య సమితి వేదికపై ప్రదర్శన ఇచ్చిన ఏకైక తెలుగు కళాకారుడు.. తన గొంతుతో కెనడీని-సర్వేపల్లి రాధాకృష్ణన్‌ని గొంతుతో కళ్లకు కట్టిన కళా ప్రపూర్ణుడు.. టెన్‌ కమాండ్‌మెంట్స్‌లోని ఆరు సన్నివేశాలను ధ్వనితోనే దృశ్యమానం చేసిన శబ్ద ఇంద్రజాలికుడు నేరెళ్ల అంతర్థానమయ్యారు.

‘‘మిమిక్రీ కళ నాతోనే పుట్టలేదు. పురాణాల నుంచే ఈ కళ ఉంది. గౌతమ మహర్షిని ఏమార్చడం కోసం ఇంద్రుడు కోడిలా కూశాడు. రామాయణంలో మాయలేడిగా మారీచుడు.. రాముడి స్వరంతో హా.. లక్ష్మణా.. హా.. సీతా అని ఆక్రోశించాడు. ద్రౌపది గొంతును అనుకరించడం ద్వారా భీముడు నర్తనశాలలో కీచకుడిని చంపాడు. పురాణాల్లో దీన్ని స్వరవంచన అనేవారు.

-నేరెళ్ల వేణుమాధవ్‌

తన కంఠంలో ఒదిగి ఉన్న ఒక్క స్వరపేటికతోవేన వేల స్వరాలను పలికించిన విన్యాసభరితగళం పూర్తిగా మూగబోయింది.‘తానొక్కడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భంగి’అయి వినిపించినస్వర విన్యాసం శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది.తనువును నిలువునా తొలిచి.. మాటలు, పాటలు, పద్యాలతో ప్రపంచాన్ని చుట్టిన, కట్టిపడేసిన..ధ్వని తరంగం అనంతంలో కలిసిపోయింది.ఆరోహణానికి.. అవరోహణానికి మధ్య..వేల గొంతుకలతో అంతులేని హాస్యం కురిపించిననేరెళ్ల వేణుమాధవ్‌ మౌనంగా నిష్క్రమించారు.భారతీయ మిమిక్రీ పితామహుడు, ధ్వని అనుకరణ సమ్రాట్‌, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్‌ కన్నుమూశారు. మిమిక్రీ కళకు గుర్తింపును తెచ్చి, శాస్త్ర హోదా కల్పించి, వందలాది కళాకారులను తయారు చేసినఆయన మంగళవారం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

ధ్వని అనుకరణ సమ్రాట్‌ నేరెళ్ల వేణుమాధవ్‌ ఇకలేరు.

85 ఏళ్ల వయసులో వరంగల్‌లో కన్నుమూత

మిమిక్రీ పితామహుడిగా ప్రపంచ ప్రఖ్యాతి

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

కేసీఆర్‌, చంద్రబాబు, గవర్నర్‌ సంతాపం

హైదరాబాద్‌, హన్మకొండ, వరంగల్‌ అర్బన్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ధ్వన్యనుకరణ సమ్రాట్‌.. స్వరబ్రహ్మ.. గ్రాండ్‌ ఓల్డ్‌మాన్‌ ఆఫ్‌ మిమిక్రీ.. నేరెళ్ల వేణుమాధవ్‌ ఇక లేరు. ఆగ్రహం.. ఆవేశం.. కరుణ.. ఆనందం.. ఇలా నవరసాలనూ అలవోకగా పలికించి వేల గొంతుకలను అనుకరించిన ఆయన గళం శాశ్వతంగా మూగబోయింది. కొంతకాలంగా మూత్రకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్‌.. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఐదు రోజుల క్రితం స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడడంతో సోమవారం రాత్రి వరంగల్‌ కొత్తవాడ బ్యాంక్‌ కాలనీలోని తన స్వగృహానికి తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం 11.10 గంటలకు ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. సాయంత్రం కొత్తవాడ శ్మశానవాటికలో పోలీసు లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. మిమిక్రీ రంగ ంలో 70 ఏళ్లకుపైగా సేవలందించి.. ఎందరో శిష్యులను తయారుచేసి.. ఆ కళను ప్రపంచవ్యాప్తంచేసిన వేణుమాధవ్‌కు భార్య శోభ, ఇద్దరు కుమారులు శ్రీనాథ్‌, రాధాకృష్ణ, ఇద్దరు కుమార్తెలు లక్ష్మీ తులసి, వాసంతి ఉన్నారు.