రవీంద్రభారతి, అక్టోబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఒక పుస్తకానికి రాసే ముందుమాట ఆ రచనకు సింహద్వారం లాంటిదని ప్రముఖ సాహితీవేత్త కె.శివారెడ్డి అన్నారు. ముందుమాటల ద్వారా తన వ్యక్తిత్వాన్ని చాటుతున్న గొప్ప కవి నందిని సిధారెడ్డి అని అభివర్ణించారు. గురువారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి రాసిన ముందు మాటల సంపుటి ‘నూరుపూలు’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. డాక్టర్‌ బెల్లంకొండ సంపత్‌కుమార్‌ సంపాదకత్వం వహించారు.

కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న శివారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ నందిని సిధారెడ్డితో 40ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు. కుటుంబ సభ్యుడిగా భావిస్తానని తెలిపారు. సిధారెడ్డి ప్రయాణంలో మంజీర రచయితల సంఘం కీలక పాత్ర పోషించిందని అన్నారు. ముందుమాట పాఠకుడికి దారి చూపుతుంది అని అన్నారు. కథ, కథనం, కవిత్వం పుస్తకం లోపల ఎలా ఉండబోతుందో డైరెక్షన్‌ ఇవ్వడమే ముందు మాట గొప్పతనమని అన్నారు. సిధారెడ్డి రాసిన ముందుమాటల్లో ఆయన వ్యక్తిత్వం కనబడుతుందని అన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్త నాళేశ్వరం శంకరం, కాశీం, గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి, సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి, వి.శంకర్‌, కందుకూరి శ్రీరాములు, తూర్పు మల్లారెడ్డి తదితరులు పాల్గొని నందిని సిధారెడ్డిని అభినందించారు. చివరిగా స్పందించిన నందిని సిధారెడ్డి తన ముందుమాటలతో పుస్తకం రావడం సంతోషంగా ఉందని అన్నారు.