తెలుగు సాహితీ ప్రియులకు శుభవార్త.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు సంతోషకరమైన వార్త.. ఎస్పీబీ పేరుతో లక్ష రూపాయల నగదు బహుమతిని దాసుభాషితం సంస్థ అందిచేందుకు సిద్ధమయింది.. తెలుగు సాహిత్యాన్ని మొబైల్ యాప్ ద్వారా శ్రవణ రూపంలో దాసుభాషితం సంస్థ అందిస్తుంటుంది.. ప్రతి యేటా నవంబర్ నెలలో శ్రీ సీపీ బ్రౌన్ జయంతి సందర్భంగా తెలుగు పోటీలను నిర్వహిస్తుంటుంది.. దాసుభాషితం సీపీబీ బహుమతి పేరిట రూ.లక్ష బహుమతిని ఇచ్చే ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాల్లోని పదో తరగతి విద్యార్థులు పాల్గొనేందుకు అర్హులు.. అయితే ఇక మీదట ఈ పేరును ‘సీపీబీ-ఎస్‌పీబీ(CPB-SPB) తెలుగు పోటీ’గా మార్చి.. అదనంగా మరో లక్ష రూపాయల బహుమతిని పెంచి తెలుగు పోటీలను నిర్వహిస్తామని.. తద్వారా దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని గౌరవించుకుంటామని దాసుభాషితం సంస్థ ప్రకటించింది.

 

ఈ సందర్భంగా దాసుభాషితం వ్యవస్థాపకులు కొండూరు తులసీదాస్ మాట్లాడారు.. ‘గత సంవత్సరం నిర్వహించిన తెలుగు పోటీకి బాలు గారు ఒక వీడియో సందేశం ద్వారా, విద్యార్థులను, తెలుగు ఉపాధ్యాయులను ఉత్సాహపరిచారు. ఈ సారి బహుమతిని ఆయన చేతుల మీదుగా అందజేద్దామనుకున్నాం. కానీ ఆయన మరణంతో అది కార్యరూపం దాల్చలేదు. పిల్లల పోటీ నిర్వహిస్తున్నప్పుడు, పెద్దలు కూడా పోటీపై ఆసక్తి కనబరిచారు. ఈ పోటీని అందరికీ విస్తరించి, ఆయన పేరు మీద ఒక బహుమతి ద్వారా తెలుగు భాషపై స్పృహను పెంచడం, తెలుగు తల్లి ముద్దు బిడ్డయిన బాలు గారికి మేము ఇవ్వగల సరైన నివాళి అనిపించింది.”.. అని తులసీదాస్ వివరించారు.

 

పోటీలో తెలుగు భాష, సాహిత్యం, సమాజంపై 30 ప్రశ్నలుంటాయని, 2018, 2019లో నిర్వహించిన పోటీల అనుభవంతో, నిపుణుల సహకారంతో ఈ సంవత్సరం ఇంకా ఆసక్తికరంగా పోటీని రూపొందిస్తున్నామని దాసుభాషితం సీఈవో కొండూరు కిరణ్ కుమార్ అన్నారు. పోటీ డిసెంబర్ 13, 2020 ఆదివారం పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహింపబడుతుంది. ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్/ల్యాప్‌టాప్ ద్వారా ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఫలితాలను డిసెంబర్ 20, 2020 ఆదివారం యూట్యూబ్ లైవ్ కార్యక్రమంలో ప్రముఖులు ప్రకటిస్తారు.

 

పోటీ నమోదుకు ఆఖరు తేదీ డిసెంబర్ 10, 2020. 
 
‘Telugu Potee’ అని 99520 29498 కు WhatsApp సందేశం పంపి గాని, www.dasubhashitam.com వెబ్‌సైట్ ద్వారా గాని పోటీకి నమోదు చేసుకోవచ్చు.