తిమ్మాపురం బాలకృష్ణ రెడ్డి స్మారక తొలి కథల పోటీకి ఆహ్వానంకమ్యూనిస్ట్ బాలకృష్ణరెడ్డిగా ప్రసిద్ధి పొందిన తిమ్మాపురం బాలకృష్ణరెడ్డి చిత్తూర దగ్గర సంతపేట గ్రామంలో 1926లో జన్మిచారు. ప్రాథమిక అభ్యాసం చిత్తూరులో, తరువాత మదనపల్లెలోని బీసెంట్ థియొసాఫికల్ కాలేజీలో చదువుకున్నారు. ఈ సమయంలోనే ఆయన రాజకీయ భావాలు కాంగ్రెస్ నుంచి కమ్యూనిజంవైపు మళ్లాయి. 1950-1952 కరువు సమయంలో సంతపేటలో గంజి కేంద్రాలు నడిపారు. దాదాపు రెండు ఏండ్లు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన తరువాత మదరాసు లా కాలేజ్ నుంచి న్యాయవాదిగా పట్టభద్రులయ్యారు. జొన్నపాడు గ్రామంలోని కృష్ణ జిల్లా ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు వంగపాటి రంగారెడ్డి (పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు సహచరుడు) గారి కూమార్తె లలితను 1954 లో ఆదర్శ వివాహం చేసుకున్నారు.చిత్తూరులో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తరువాత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని రెండుసార్లు చిత్తూరు మునిసిపల్ కౌన్సిలర్ ‌గా కమ్యూనిస్ట్ పార్టీ టిక్కెట్టుపై ఎన్నికయ్యారు. మునిసిపల్ కార్మిక, ప్రింటింగ్ ప్రెస్ కార్మిక సంఘాలను సంఘటితపరిచారు. చిత్తూరు జిల్లా కమిటీ సభ్యుడిగా రాష్ట్ర నాయకులతో కలసి ఉద్యమాలలో పనిచేసారు. రైతులపైన సెస్ పెంచినపుడు జరిగిన నిరసనలలో పాల్గొని, అరెస్ట్ అయి రాజమండ్రి జైలుకి వెళ్లారు. 1964లో కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా విడిపోయిన తరువాత పార్టీ అభిమానిగా న్యాయ సేవలందించారు. తిరుపతి కుట్ర కేసులో కమ్యూనిస్ట్ నాయకులూ, మదనపల్లె స్పిన్నింగ్ మిల్ కార్మిక సంఘాల తరపున వాదించి వారికీ విజయం చేకూర్చారు.పులిచెర్ల ప్రాంతంలోని భూస్వాములు అక్రమంగా వేసిన పలు కేసులలో పార్టీ సభ్యులకి అండగా నిలిచారు. పౌరహక్కుల విషయంలో పనిచేసి అక్రమంగా అరెస్ట్ అయిన అనేకమందిని ఆదుకున్నారు. వివిధ గ్రూపులుగా విడిపోయిన పార్టీ ఏకం కావాలని, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో కలవాలని బాలకృష్ణారెడ్డి ఆకాక్షించే వారు.సోవియొట్ యూనియన్ విచ్చిన్నమైనపుడు తాత్కాలికంగా ఆశాభంగం చెందారు. కానీ చివరి వరకు మార్క్సిస్ట్‌గా నిలబడ్డారు. వ్యవసాయం అంటే బాగా ఇష్టపడేవారు. న్యాయవాద వత్తిలో వుంటూనే సంతపేటలో వ్యవసాయం కూడా చేసేవారు. తెలుగు సాహిత్యంపై మక్కువతో ఎన్నో పుస్తకాలు చదివి బంధుమిత్రులతో చర్చించేవారు. బాలకృష్ణారెడ్డి జీవితాంతం నమ్మిన, ఆచరించిన అభ్యదయ భావాలను, ఆదర్శాలను ప్రోత్సహించే దిశగా ఈ స్మారక కథల పోటీలు నిర్వహిస్తున్నాము.

 ఒక్కో కథకు రూ. పదివేలు లేక US$150 చొప్పున మూడు ఉత్తమ కథలకు బహుమతి. 

కథలు పంపించడానికి గడువు: అక్టోబరు 15, 2020

కథలు పంపించాల్సిన ఈ-చిరునామా: [email protected]

ఫలితాలు: ‘‘సారంగ’’ పక్ష పత్రిక నవంబర్ సంచికులు

కథలు అభ్యుదయ భావాలతో సమకాలీన సమాజాన్ని పురోగమనం వైపు నడిపించే విధంగా ఉండాలి. రచన సొంతమనీ, దేనికి అనుకరణగాని, అనువాదంగాని కాదని, ఇంతకు ముందు ఎక్కడా ప్రచురణ కాలేదని, మరే సంస్థ పరిశీలనలో లేదని హామీ పత్రాన్ని విధిగా జతపరచాలి. రచనలు యూనికోడ్ పాంట్. వర్డ్ ఫార్మాట్‌లో ఉండాలి. బహుమతులపై నిర్వాహకులదే తుది నిర్ణయం. ఈ పోటీ విషయంలో ఏ విధమైన ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.

వివరాలకు: magazine.saarangabooks.com/కథల-పోటీకి-ఆహ్వానం/