‘‘ఇంత నిరాశ చీకటిలోనూ/ ఎక్కడో ఓ మిణుగురుపురుగు/ ఎప్పుడో నువ్వు వస్తావన్న చిన్ని ఆశ/ ఆ నిరీక్షణే నా జీవితానికి ఊపిరి’’ (నిరీక్షణ, 14-7-1967, ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక) ‘‘ఇది కుట్రదారులు విసురుతున్న వల/ సమాధానంగా తెగవల నాది తల/ అందుకే ఇది/ మహావిప్లవావిష్కరణకు పదును/ మరోసారి మోసపోవడానికి కాదు అదును’’ (ఇంక్విలాబ్‌, ‘లే’ కవితాసంపుటి, ఫిబ్రవరి, 1971) ‘‘నేను/ అనే భావన/ నాది అనే ఆలోచనకు దారితీస్తుంది/ ఇక చూసుకో సోదరా/ జనాన్ని నంజుకు తినేస్తాం! (నేను-నాది; కొత్తకలాలు 2–5-1975, ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక).

ఈ మూడు కవితలూ అప్పుడే కొత్తగా సాహిత్యప్రవేశం చేస్తున్న క్రొన్నెత్తురుల యువకవి రాసినవి. మొదటిది ప్రణయ భావన, రెండోది విప్లవం, మూడోది నాది అనే వ్యష్ఠి నుంచి మాది అనే సమష్టి భావనను చెప్పేది. ఈ మూడు కవితలూ నిన్న విశాఖపట్నంలో తీవ్ర అనారోగ్యంతో ఆకస్మికంగా కన్నుమూసిన అత్తలూరి నరసింహారావు రాసినవి.ఆంధ్ర విశ్వకళాపరిషత్తు, తెలుగు విభాగంలో ఆచార్యులుగా పనిచేసిన అత్తలూరి నరసింహారావు 1946 జూన్‌ 1న గుంటూరు జిల్లా బిక్కసానివారిపాలెంలో జన్మించారు. అమ్మ అనసూయ, నాన్న భాస్కరరావు.

పెద్దక్క భర్త తమ్ముడైన త్రిపురనేని మధుసూదనరావుగారితో పరిచయం ఆయన్ని మార్క్సిజం వైపు ఆకర్షింపజేసింది. మరో అక్క కొడుకు త్రిపురనేని శ్రీనివాస్‌ ఆ తానులోని గుడ్డే. ప్రాథమిక విద్య గోగినేనివారిపాలెంలోను, డిగ్రీ తిరుపతిలోనూ పూర్తి చేశారు. ఆంధ్ర యూనివర్శిటీలో ఎం.ఎ తెలుగు చేసి తిలక్‌పై పరిశోధన చేసి డాక్టరేట్‌ చేశారు. ఆ సమయంలోనే తెలుగు శాఖలో వ్యుత్పత్తి పదకోశం ప్రాజెక్టులో చేరి తర్వాత లెక్చరర్‌గా కుదురుకున్నారు. సాహిత్యంలో ప్రయోగాలకు పెట్టింది పేరైన అత్తలూరి, మిత్రులతో కలిసి ‘అద్వయం భైచంకొ’ పేరుతో నిరసన కవిత్వం రాశారు. (అబ్బూరి, అత్తలూరి, భైరవయ్య, చందు సుబ్బారావు, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ). ఈ విషయంలో వీళ్లకు దిగంబర కవులు ఆదర్శం. రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, చాసో, భూషణం, అర్నాద్‌, వివిన మూర్తి, పురిపండా, కెవిఎస్‌ వర్మ వంటి వారితో సన్నిహితంగా మెలిగారు. బంగోరె, వేల్చేరు నారాయణరావు వంటివారిని గురుమిత్రులుగా భావించేవారు.