కాలం ఎప్పుడూ సాపేక్షమే. కవిత్వమూ అంతే. రోజులు గడిచే కొద్దీ కవీ కవిత్వమూ కాలపరీక్షను ఎదుర్కొంటారు. ఒకానొక వర్తమానంలో కొన్ని సిద్ధాంతాలు, ధోరణులు, వాదనలూ సాహిత్యాన్ని బలంగా ప్రభావితం చేస్తాయి. అవి ఎంత బలంగా ఉంటాయంటే వాటికి ఎదురువెళ్లడం యుగధర్మాన్ని ప్రతిఘటించడమే అవుతుంది. అంతటి ప్రతికూల పరిస్థితులలో కూడా వాటికి భిన్నమైన ఆలోచనలు పొడ చూపుతుంటాయి. వాటిని గుర్తించ డానికీ, ప్రేమించడానికీ, ప్రకటించడానికీ సమాజం భయపడుతుంది.

 ఈ ఆలోచనలు చిన్నప్పుడు కథలో చదువుకున్నట్టుగా తుఫాను సమయంలో తలలు వంచి వాతావరణం తెరిపినపడ్డాక తలలెత్తే చిన్నచిన్న మొక్కలు. ఇవి క్రమంగా ఎదిగి అస్తిత్వాన్ని ప్రకటిస్తాయి. అట్లాగే ఎన్ని విప్లవాత్మక మార్పులు సంభ వించినా గతంతో పూర్తిగా తెగదెంపులు చేసుకోలేని లక్షణం ఒకటి సమాజంలో ఉంటుంది. రాయి ఆదిమ మానవుడి ఆయుధం. అయితే అణ్వాయుధాలు వచ్చిన కాలంలోనైనా కుక్క వెంటపడ్డప్పుడు కంటికి కనిపించిన బెడ్డముక్కే ఆయుధమౌతుంది. ఎన్ని గ్రైండింగ్‌ మెషీన్లు వచ్చినా రుచితెలిసిన గృహిణి ఎక్కడో ఒకచోట సన్నికల్లు మీద పచ్చడి నూరుతూనే ఉంటుంది. దీన్నే అవిచ్ఛిన్నత అన్నారు. వర్తమాన నూతన భావనలు గతాన్ని ప్రభావితం చేసిన కొన్ని సార్వత్రిక మానవీయ భావనల్ని తనతో కలుపుకున్నపుడూ, మానవజాతి విముక్తికి ఏ ఒక్క సిద్ధాంతమో పరిష్కారం చూపలేదని భావించినపుడూ, అఖండసత్యం అంటూ లేదనీ ఉన్నవన్నీ పాక్షిక సత్యాలేననీ అర్థమైనపుడూ ఆలోచనాపరుడు లేదా కళాకారుడు విభిన్నమైనవీ లేదా వ్యతిరిక్తమైనవీ అనుకున్న భావనల్ని సంలీనపరుస్తాడు. దాన్నే బహుళ తాత్వికత అనవచ్చు. యాభై ఐదేళ్ల క్రితం మరణించి ఈ సంవత్సరం శతజయంతి జరుపుకుంటున్న దేవరకొండ బాలగంగాధర తిలక్‌ (1 ఆగస్టు 1921 - 1 జులై 1966) కవిత్వం అటువంటి బహుళతాత్వికతకు ఉత్తమ ఉదాహరణ అనిపిస్తుంది.శ్రీశ్రీ యుగంలో కవిత్వ వ్యక్తిత్వాన్నీ నిలుపుకున్న ఒకరిద్దరిలో తిలక్‌ ఒకడు. శ్రీశ్రీ అతన్ని వయస్సు సగం తీరక ముందే, నభం సగం చేరకముందే అస్తమించిన ప్రజాకవీ, ప్రభారవీ అన్నాడు.

సమకాలిక సమస్యలకు స్వచ్ఛ స్ఫాటిక ఫలకం అని కూడా అన్నాడు. అభ్యుదయ భావాలకు రమ్యమైన శైలిని సమకూర్చడంలో తిలక్‌ కృతకృత్యుడయ్యాడన్నారు కుందుర్తి. కుందుర్తి వేసిన బాటలో చాలామంది ప్రయాణించి తిలక్‌ని భావాభ్యుదయ కవి అనీ, మానవతా వాద కవి అనీ అన్నారు. రాచమల్లు రామచంద్రారెడ్డి తిలక్‌ నెహ్రూ మీద రాసిన ఎలిజీలో తన లక్షణాలనే నెహ్రూకు ఆపాదించినట్లు చెబుతూ తిలక్‌ ఏమరుపాటున అభ్యుదయం మాట్లాడినా అతను తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడని అన్నారు. అయితే వీళ్లందరూ తిలక్‌ సమకాలికులు. తిలక్‌ కవిత్వం రాస్తున్న కాలంలో జీవించి, ఆయన మరణించిన కాలపు సమీప వర్తమానంలో స్పందించిన వాళ్లు. వీళ్లు తిలక్‌ను అంచనా కట్టే నాటికి తిలక్‌ మీద ఎవరెవరి ప్రభావాలు ఉన్నాయో గ్రహింపుకొచ్చే వీలుంది కానీ కాలం మీద తిలక్‌ చూపగల ప్రభావం వారి చర్చలో లేదు. తిలక్‌ మరణించిన అర్ధశతాబ్దం తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆయన నడచిన, దారులు వేసిన బాటలు ఇప్పుడు తెలుగు కవిత్వానికి రహదారులయ్యాయని అర్థమౌతుంది. అప్పుడు నిరాదరణకు నిర్లక్ష్యానికి నిందకూ గురైన భావనలు కొన్ని ఇప్పుడు ఆదరింపబడి ఆమోదింపబడుతున్నాయని కూడా అర్థమౌతుంది. ఉదాహరణకు రా.రా. దుర్లక్షణంగా భావించిన ఏకాంత సౌందర్య రచన, స్వాప్నికతలు కవిత్వం కోల్పోవడానికి వీలులేని మౌలిక లక్షణాలని అంగీకార మైంది. రా.రా. తిలక్‌లో నిరసించిన ప్రబంధ కవిత్వ భాష కూడా కవి తన భాషా సామర్థ్యం కోసం అధ్యయనం చేయాల్సిన అంశమే అయ్యింది. మొత్తం మీద కొంచెం తేరిపార చూస్తే తెలుగు కవిత్వం మీద ఇప్పుడు శ్రీశ్రీ కాలం నాటి ఏకైక సిద్ధాంత ప్రభావం కన్నా తిలక్‌లోని బహుళ తాత్విత ఛాయలే ఒకింత ఎక్కువ ఉన్నట్టనిపిస్తుంది.