తీవ్ర అస్వస్థతతో ఏకాంబరాచారి మృతి
అంతకుముందు రోజే భార్య మరణం
250 పుస్తకాలు.. పత్రికలకు 400 వ్యాసాలు
‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం అనుంబంధానికి 100 మంది అవధానుల పరిచయం
రేడియో, దూరదర్శన్‌ కార్యక్రమాలకూ రచనలు.. 
హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ రాపాక ఏకాంబరాచారి (80) 
ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని మహావీర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 
ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన భార్య రుక్మిణి 
శనివారం కన్నుమూశారు. రాపాక దంపతులకు నలుగురు సంతానం. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో రాపాక జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో బీఏ చదివారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ చేశారు. పలు కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేసిన అనంతరం గ్రూప్‌-1కు ఎంపికై సహకార శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా చేరారు. జాయింట్‌ రిజిస్ట్రార్‌గా రిటైరయ్యారు. వృత్తిరీత్యా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. రాపాక, ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూనే సాహితీ సేద్యం చేశారు. దాదాపు 250కు పైగా పుస్తకాలను రాశారు. 
 
‘ఆంధ్రజ్యోతి’ సహా పలు తెలుగు దిన పత్రికల్లో 400కు పైగా వ్యాసాలు రాశారు. ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం అనుబంధంలో దాదాపు 100కు పైగా అవధానులను పరిచయం చేశారు. తర్వాత రోజుల్లో ఈ వ్యాసాలతో పాటు అవధాన విద్యకు సంబంధించిన అనేక అంశాలతో ‘అవధాన సర్వస్వము’ అనే గ్రంథం విడుదల చేశారు. దాదాపు 200 మంది అష్టావధానులు, శతావధానులు, సహస్రావధానుల గురించి జీవిత విశేషాలు, వారి అవధాన విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. రేడియో, దూరదర్శన్‌లో ఎన్నో కార్యక్రమాలకు రచనలు చేశారు. టీటీడీ బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహించారు. 
 
దూరదర్శన్‌, సప్తగిరి వంటి చానెళ్లకు సలహా సభ్యుడిగా  వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం 
నుంచి సాహిత్యంలో డాక్టరేట్‌ పొందారు. నన్నయ్య నుంచి నేటి కవుల దాకా పద్య సౌరభం పేరుతో 
రెండు భాగాలుగా పుస్తకాన్ని తేవాలని అనుకున్నారు. గుర్రం జాషువా, చీమకుర్తి శేషగిరిరావు స్మారక పురస్కారాలు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం సహా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.  విశ్వబ్రాహ్మణ ధర్మపీఠానికి సభాపతిగా   సేవలనందించారు. రాపాక మృతిపట్ల ధర్మపీఠం నాయకులు, సాహితీవేత్తలు ఆచార్య గౌరీశంకర్‌, చొల్లేటి కృష్ణమాచార్యులు, కొణ్యాల శివానందం, అయాచితం నటేశ్వర శర్మ, రంజిని పూర్వ అధ్యక్షులు చిక్కోలు సుందరయ్య సంతాపం వ్యక్తం చేశారు.