రవీంద్రభారతి/హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రతి విజయం వెనుక ఆనందం ఉండదని, కానీ ప్రతి ఆనందం వెనుక విజయం ఉంటుందని ప్రభుత్వ కార్యదర్శి, ఐఏఎస్‌ బుర్రా వెంకటేశం అన్నారు. సక్సెస్‌ సాధించిన చాలా మందిని పరిశీలించాక పుస్తకం రచించానని తెలిపారు. గురువారం రవీంద్రభారతి ప్రివ్యూ థియేటర్‌లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, అక్షరయాన్‌, ఆల్‌ ఇండియా రేడియో సంయుక్తాధ్వర్యంలో బుర్రా వెంకటేశం రచించిన సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌ పుస్తక సమీక్ష నిర్వహించారు. ఈ పుస్తకం అమెజాన్‌లో బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచిన సందర్భంగా ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ ప్రపంచమంతా సక్సెస్‌ వెనుక పరుగెడుతోందన్నారు. అయితే విజయం తర్వాత అందరూ ఆనందంగా ఉన్నారా? అంటే పూర్తి స్థాయిలో లేరని తెలిపారు. ప్రపంచం మనల్ని చూసే విధానం, మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచానని చెప్పారు.