ఈ నెల 24నుంచి ఫెస్ట్‌ 
విద్యారణ్య స్కూలు వేదిక
ఆదూర్‌ గోపాల్‌ కృష్ణ తదితరుల రాక
ఆస్ట్రేలియా సాహితీవేత్తలు ప్రత్యేకం
 
సాహిత్యం, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌. జాతీయ, అంతర్జాతీయ స్థాయి రచయితల సాహితీ ఊసులతో, సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలపై సంభాషణతో కొత్త సంస్కృతికి అద్దం పట్టే సాహిత్య పండగ మరో మూడు రోజుల్లో మొదలవనుంది. ఆస్ట్రేలియా సాహితీ దిగ్గజాలు 14మంది పాల్గొంటున్నారు. మలయాళ కవులతో చర్చాగోష్టి, కళారూపాల ప్రదర్శన ప్రత్యేకం. హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ పదవ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటూ సాగే వినూత్న కార్యక్రమాలకు విద్యారణ్య పాఠశాల వేదిక కానుంది. 

హైదరాబాద్‌ సిటీ, జనవరి20 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగర సిగలో కొలువుదీరిన అంతర్జాతీయ సాహితీ సంబురం ‘హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌’. సాహిత్య, సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచేకాదు, విదేశాలనుంచి సైతం రచయితలు, కవులు, కళాకారులు నగరానికి విచ్చేస్తారు. మూడు రోజులపాటూ సాగే ఫెస్ట్‌లో సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై చర్చాగోష్ఠులు, వర్తమాన సాహిత్యంపై సంభాషణ, రంగస్థలం, చిత్రలేఖనం, మోడ్రన్‌ ఆర్ట్‌, శాస్త్రీయ, పాశ్చాత్య నృత్య, సంగీత ప్రదర్శనలు,  సినిమా, డాక్యుమెంటరీలు, ‘కావ్యధార’ గానాలు, కథా చర్చలు, ఆధునిక రచనల పోకడలు... ఇలా ఒకటా, రెండా ఈ నెల 24నుంచి 26 వరకు సాగే ఉత్సవంలో బోలెడన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 

 పురుడు పోసుకొని పదేళ్లు...

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ పురుడు పోసుకొని సరిగ్గా పదేళ్లు. విశ్రాంత ఆచార్యుడు టి. విజయ్‌కుమార్‌, జి.సూర్యప్రకాశ రావు కలిసి 2005లో ‘మ్యూస్‌ ఇండియా’ లిటరరీ మ్యాగజైన్‌ను ప్రారంభించారు. ఆ పత్రికకు సాహిత్య వ్యాసాలను అందించిన రచయితలు, కవులతో ప్రతి యేటా డిసెంబరులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఆనవాయితీ. అలా 2009లో నగరంలోని తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల రచయితలు, కవులనూ ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని విభిన్న భాషలలోని సాహితీవేత్తల కలయికకు ఒక వేదికను నెలకొల్పాలనే ఉద్దేశంతో 2010, డిసెంబరులో లిటరరీ ఫెస్ట్‌ను ప్రారంభించారు. అందులో అజయ్‌ గాంధీ, అమిత దేశాయ్‌, కిన్నెర మూర్తి తదితరుల సమష్టి కృషితో సాహితీ పండుగను నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు విజయకుమార్‌ తెలిపారు.

ఆస్ట్రేలియా అతిథులు...!

 2012లో ‘గెస్ట్‌ నేషన్‌’ పేరుతో ప్రతి ఏటా ఒక్కో దేశం నుంచి సాహితీ దిగ్గజాలను ఫెస్ట్‌కు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటి వరకు జర్మనీ, ఫ్రాన్స్‌, చైనా తదితర దేశాలనుంచి పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా 14మంది ప్రముఖ సాహితీకారులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు వివరిస్తున్నారు. దాంతో పాటూ ఒక భారతీయ భాషనుంచి కళాకారులు, రచయితలు పాల్గొంటారు. ఈ ఏడాది మలయాళం నుంచి పలువురు సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొంటున్నట్లు సమాచారం.