ఖైరతాబాద్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): మనస్సుపై నిగ్రహం సాధిస్తేనే ఎందులోనైనా విజయం సాధించవచ్చని మైండ్‌ మేనేజ్‌మెంట్‌లో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన స్వామి ముకుందానంద పేర్కొన్నారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఆయన కొత్తగా రాసిన ‘విజయం, సంతోషం, సంతృప్తి కోసం ఏడు విభిన్న ఆలోచనా విధానాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో పేర్కొన్న ఏడు విభిన్న ఆలోచనలపై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌లో ఏడు రోజులపాటు ఒక్కో ఆలోచనపై ప్రసంగ కార్యక్రమాలు ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి ముకుందానంద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీవితంలో తక్కువ ఆకాంక్షలు ఉంటేనే ఎక్కువ సంతోషం దక్కుతుందని పేర్కొన్నారు. విజ్ఞానాన్ని వైదిక సంపదతో మిళితం చేసుకుని.. ఆధ్యాత్మిక పరిజ్ఞానానికి తర్కాన్ని జోడించి ఏడు విభిన్న ఆలోచనలను పొందుపర్చానని తెలిపారు. 

ఈ పుస్తకంలో మెదడుకు శిక్షణ అందించడం, దాన్ని తీర్చిదిద్దడం, మెదడుకున్న విశేష పరిజ్ఞానాన్ని విజయం కోసం వినియోగించుకునే ధీమాను వ్యక్తం చేశామన్నారు. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రోజూ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌లో పుస్తకంపై ప్రసంగ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. క్యాడ్‌సిస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి హరీష్‌ రంగాచార్య మాట్లాడుతూ స్వామీజీ హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా డిసెంబర్‌ 9 నుంచి 11 వరకు కార్పొరేట్‌ కార్యాలయాలను సందర్శిస్తారని, 12 నుంచి 14వ తేదీ వరకు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు బుక్‌సైనింగ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సత్యవాణి ప్రాజెక్ట్స్‌ నిర్వాహకులు సూర్యప్రకాశ్‌ రావు, ప్రముఖ డెవలపర్‌ బాల శ్రీనివాసరావు, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ తెలంగాణ శాఖ చైర్మన్‌ డాక్టర్‌ జి.రామేశ్వర్‌ రావు, కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.