ఆత్రేయ పేరు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చేవి- ఆయన సినిమా పాటలు, అభిరుచి గల కొందరికి ఆయన నాటకాలు కూడా! కాని ఎవరికో తప్ప కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ వంటి మహామహులు మెచ్చిన పద్య కవిత్వాన్ని కూడా ఆత్రేయ రాసినట్టు తెలియదు. ఆత్రేయ రచనల్లో సినీ నాటక సాహిత్యాలు గంగా యమునల వంటివైతే- అంతర్వాహిని అయిన సరస్వతి పద్యసాహితి.ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. పేరులోని ఆచార్యను గోత్ర నామామైన ఆత్రేయకు కలుపుకొని ‘ఆచార్య ఆత్రేయ’ అనే కలం పేరుతో ప్రసిద్ధులయ్యారు. సొంత ఊరు నెల్లూరు జిల్లా సుళ్లూరు పేట సమీపంలోని ‘ఉచ్చూరు’ అనే వ్యవహార నామం కలిగిన వత్సపురి కాగా, జన్మించింది దానికి సమీపంలోని ‘మంగళంపాడు’లో. జన్మదినం మే 07, 1921.ఆత్రేయ రచనా వ్యాసంగం పద్యంతోనే ప్రారంభమయింది. ఆయన తన మొదటి పద్యాన్ని పాఠశాలలో విద్యార్థిగా వుండగానే రాశాడు- అదీ యాదృచ్ఛికంగా! ఆత్రేయ పెద మేనమామ శ్రీనివాస వరదాచార్యులు తెలుగు పండితులు. ఆ వాసన ఆత్రేయకు వుండదా అని సహాధ్యాయి అయిన చెంగలువరాయ పిళ్లె తను రాసిన పద్యాలను ఆత్రేయకు చూపి వాటి బాగోగులు చెప్పమన్నాడు. ఆత్రేయ దానిని సవాలుగా తీసుకొని తనకు పద్య విద్యను నేర్పమని మేనమామను అడిగాడు. ఆయనిచ్చిన ‘సమాసాలంకార ఛందోదర్పణా’న్ని ఆ రాత్రికి రాత్రే చదివి ఆకళింపు చేసుకొని మరనాడు పిళ్లె పద్యాల మీద తన అభిప్రాయాన్ని ఒక కందపద్యంలో రాసి చూపించాడు:తప్పులు చాలగలవు నేచెప్పితినని కోపపడుట చెల్లదు నీవేచప్పున సరిదిద్దుకొనుముపప్పులు నములుటలు కావు పద్య రచనముల్‌- గణయతి ప్రాసల్ని యెలాగో సరిపెట్టుకొంటూ దీన్ని రాశాడు! అలాగే అచ్చయిన ఆత్రేయ మొదటి కవిత ఆయన రాయవెల్లూరులోని ‘ఊరిస్‌’ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతుండగా ‘ఢంకా’ పత్రికకు రాసి పంపిన ‘దేవుళ్లదంతా అన్యాయమే!’ అనేది.ఛందోబద్ధమైన పద్య కవిత్వం పట్ల ఆత్రేయ జీవితాంతం మక్కువను చూపారు.

 

ఆయన 20వ యేట భగవద్గీతను పద్యాల్లో రాస్తే అది కాస్తా బస్‌ ప్రయాణంలో పోయిందట. అలాగే మంగళంపాడు లోని ‘శ్రీసౌందర్యవల్లీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల స్వామి’ మీద ఒక శతకం రాస్తే అది కూడా కాలగర్భంలో కలిసిపోయిందట! స్వాతంత్య్రం రాగానే ఆనందపడుతూ రాసిన ‘సుప్రభాతం’ ఆ తర్వాత అది దుర్వినియోగమవుతున్నందుకు ఆవేదనతో రచించిన ‘అరణ్య రోదనం’ పద్య కావ్యాలు కూడా అలభ్యాలే. అయినా, ఆయన గుర్తుకు తెచ్చుకుని మిత్రులకు వినిపించిన ‘అరణ్య రోదనం’లోని నాలుగైదు పద్యాలు మాత్రం మచ్చుతునకలుగా మిగిలాయి. వాటి నుంచిఓ పద్యం:మ: వినువారెవ్వరరణ్యరోదనము మా విశ్వాసముందోచి పెత్తనముం జేతులబట్టి, కన్నులరమోతల్పడ్డ మీరపుడిచ్చిన హామీలవి బుట్టదాఖలయెగా, చేజేతనీ శిక్ష నెత్తిన మేమేకొని తెచ్చుకొంటి, ఇవియా దీన ప్రజారక్షణల్‌?- దీనిలో స్వాతంత్ర్యానంతరం పాలకుల వాగ్దాన భంగాలతో హతాశులైన ప్రజల ఆర్తికి, ఆవేదనకు అద్దం పట్టారు ఆత్రేయ.ఆత్రేయ పద్యసాహితిలో ప్రధానమైంది- 375 పద్యాల్లో రచించిన ఆయన అసంపూర్ణ ఆత్మకథ. అందులో మూడు ముఖ్యమైన భాగాలున్నాయి. మొదటిది పుట్టు పూర్వోత్తరాలు, రెండవది మాతృవియోగం, మూడవది భగ్నప్రేమ.