ఆమె నృత్యం నేర్చుకోవటం వాళ్ల నాన్నకు ఇష్టం లేదు. నృత్యంలో ఓనమాలు నేర్పిన గురువు ఆమెను నృత్యానికే పనికిరావు అన్నారు. అంత వ్యతిరేకత మధ్య కూడా తాను అనుకున్న నృత్యరీతిలో అత్యున్నత శిఖరాలు అధిరోహించారు శోభానాయుడు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఆమె చెప్పిన విశేషాలివి..

‘‘మా ఇంట్లో పాటలు పాడేవారున్నారు. డ్యాన్స్‌ వచ్చిన వారు లేరు. మా ఇంట్లో డ్యాన్స్‌ అనేది బ్యాన్‌. నాకు మూడేళ్లప్పుడు ఊయలలో ఊగేప్పుడు లయబద్ధంగా చేతులు, కాళ్లు కదిపేదాన్నట. దాంతో అయిదో ఏటనే మా అమ్మ నన్ను రాజమండ్రిలోని పి.లక్ష్మణరెడ్డి గారి దగ్గర నాట్య శిక్షణలో చేర్పించింది. ఆ తర్వాత ఏలూరుకు మకాం మార్చాం. నాన్న నన్ను డాక్టర్‌ని చేద్దామనుకున్నారు. అందుకే నా డ్యాన్స్‌ గురించి కాంప్లిమెంట్స్‌ ఇచ్చేవారు కాదు. మేము ఏలూరులో ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగింది. ఏలూరులోని మా గురువుగారు చెన్నైలో నన్ను అరంగేట్రం చేయిస్తానన్నారు. దానికి డబ్బంతా మా నాన్నగారే పెట్టుకున్నారు.

విచిత్రమేంటంటే పెట్టాబేడా సర్దుకుని నేను వారికోసం ఎదురుచూశా. మా గురువుగారు చెన్నై వెళ్లిపోయారు. మూడురోజుల తర్వాత మా గురువుగారు మా ఇంటికి వచ్చి ’మీ అమ్మాయి నాట్యానికి పనికిరాదు, ఆ ఫీచర్సే లేవు, అరంగేట్రం వేస్ట్‌’ అన్నారు. నాన్న ’సరే, ఆ మాట ముందే చెప్పి ఉండాల్సింది‘ అన్నారు. ఈ మాటలు నేను వంటింటి లోంచి విన్నా. నాకు చాలా బాధ కలిగింది. చాలా ఏడ్చా. ఎలాగైనా డ్యాన్సర్‌గా పేరు సంపాదించాలనే పట్టుదల పెరిగింది. దీనితో అరంగేట్రం చేయటానికి నాన్నకు ఒప్పించా. అమ్మతో కలిసి చెన్నైకు వెళ్లా. అక్కడ మా తాతయ్య గారి కుటుంబం ఉండేది. వారి దగ్గర ఉండి- ఏడాది పాటు వెంపటి చినసత్యం గారి దగ్గర నృత్యం నేర్చుకున్నా.

 

సత్యభామ పాత్రలో మెప్పించా!

ఒకసారి నేను తాతయ్యతో కలిసి ’శ్రీకృష్ణ పారిజాతం‘ ప్రోగ్రామ్‌ చూశాను. సత్యభామ పాత్ర నన్ను విపరీతంగా ఆకర్షించింది. ’తాతయ్యా.. జీవితంలో ఒక్కసారైనా సత్యభామ పాత్ర చేయాలని ఉంది’ అన్నాను. ఏ ముహర్తాన అన్నానో తెలియదు కానీ.. మూడు దశాబ్దాలుగా సత్యభామ పాత్ర చేస్తూనే ఉన్నా. అందరూ సత్యభామను గర్విష్టి అంటారు కానీ ఆమె అమాయకురాలు అనిపిస్తుంది. సత్యభామ పాత్రలో నవరసాలు ఉన్నాయి. నాట్యశాస్త్ర భంగిమలున్నాయి. అందుకే నా ఉద్దేశంలో సత్యభామ పాత్రలో ఎవరైతే మెప్పిస్తారో వారే కూచిపూడి నర్తకి కింద లెక్క. ఏడాది కాలం నృత్యం నేర్చుకున్న తర్వాత నేను అరంగేట్రం ఇచ్చా. అదృష్టవశాత్తు అందరూ నన్ను మెచ్చుకున్నారు. మీడియాలో నా గురించి మంచి కథనాలొచ్చాయి. వెంటనే 12 ప్రోగ్రాములు చేసే అవకాశం దక్కింది. విదేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చా. ట్రినిడాడ్‌లో నా ప్రదర్శనను ఇద్దరు దంపతులు చూశారు. నా డ్యాన్స్‌ చూసి అభిమానంతో వాళ్ల పాపకు నా పేరు పెట్టుకున్నారు. ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను.

 

గురువుగారి మెప్పు ..

గురువు గారు (వెంపటి చినసత్యం) చాలా కఠినమైన శిక్షకుడు. ఒకసారి చండాలిక నృత్యరూపకం చేస్తున్నాం. ‘‘చండాలిక పాత్రలో నువ్వు జీవించాలి. ఏ మాత్రం నచ్చకపోయినా తీసిపారేస్తా’’ అన్నారు. ఆ నృత్యరూపకంలో నేను ఏడ్వాలి. కానీ ఎంత సేపు ప్రాక్టీసు చేస్తున్నా- నాకు ఏడుపు రావటం లేదు. దాంతో ప్రోగ్రామ్‌ క్యాన్సిల్‌ చేయండని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. ఆయన దగ్గరకు వెళ్లి- ‘గురువుగారు.. ఇప్పుడు చేస్తాను’ అన్నాను. ఆయన నన్ను ఒకే ఒక్కసారి అభినందించారు. నాకు తట్టు వ్యాధి వచ్చి.. ప్రోగ్రామ్‌ చేయలేని స్థితిలో ఉన్నా. కానీ తప్పనిసరిస్థితుల్లో ప్రోగ్రామ్‌ చేయాల్సి వచ్చింది. తట్టు అంటువ్యాధి కాబట్టి మేకప్‌మ్యాన్‌ నాకు మేకప్‌ వేయటానికి ఇష్టపడలేదు. దాంతో నేనే మేకప్‌ వేసుకొని ప్రోగ్రామ్‌ పూర్తి చేశా. అప్పుడు గురువుగారు ‘ఇప్పుడు ఆర్టిస్టువనిపించుకున్నావమ్మా’ అన్నారు. నా జీవితంలో నాకు వచ్చిన అతి గొప్ప కాంప్లిమెంట్‌ అది.’’