కొంతమంది బివివి ప్రసాద్‌ కవిత్వాన్ని తాత్విక కవిత్వం అన్నారు. ఇంకొందరు ముందుకుపోయి ఆధ్యాత్మిక కవిత్వం అన్నారు. ఇదొక మార్మిక కవిత్వం అన్నారు, మిస్టిసిజం అన్నారు. తన్మయ కవిత్వం అన్నారు. మన కాలపు జిబ్రాన్‌ అన్నారు. ఇన్ని రకాలుగా బివివి కవిత్వాన్ని వర్ణించడం వలన దానికి మేలుకన్నా కీడే ఎక్కువ జరిగింది అని నా భావన. అందుకే వాటన్నిటినీ నేను పక్కనపెట్టి దీన్ని ‘అనుభవ కవిత్వం’ లేక పోతే ‘అనుభూతి కవిత్వం’ అంటాను.

తిలక్‌ పుట్టిన ఊరు తణుకు నుంచి తెలుగు కవిత్వానికి కలకాలం మిగిలే కవి ఇంకొకరు వున్నారు. అతనే బివివి ప్రసాద్‌. మనం ఈ రోజు ‘అమృతం కురిసిన రాత్రి’ని ఎలా చదువుకుంటున్నామో, మన భవిష్యత్‌ తరాలు బివివి హైకూలని, ‘ఆకాశం’ కవిత్వ సంపుటిని అలా చదువుకుంటారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.చాలా కాలంగా తెలుసు బివివి నాకు. దాదాపు అతని మొదటి సంపుటి ‘ఆరాధన’ వచ్చిన రోజుల్నించి అతన్ని, అతని కవిత్వాన్ని శ్రద్ధగా గమనిస్తున్నవాడిని.

అతనితో కవిత్వ సంభాషణలు చేసినవాడిని. ఒక్కమాటలో చెప్పమంటే, చలాన్ని అరుణాచలం నుంచి తీసుకొచ్చి కొత్త శరీరంలో ప్రవేశపెట్టి కవిత్వం రాయమంటే అది బివివి కవిత్వంలా వుంటుంది. అందుకే బివివికి నేను పెడుతున్న ముద్దుపేరు ‘అరుణాచలం’. చూడ్డానికి కూడా ‘యువ చలం’లా ఇతను వుండడం కాకతాళీయమే. కొంత మంది బివివి కవిత్వాన్ని తాత్విక కవిత్వం అన్నారు. ఇంకొందరు ముందుకు పోయి ఆధ్యాత్మిక కవిత్వం అన్నారు. ఇదొక మార్మిక కవిత్వం అన్నారు. మిస్టిసిజం అన్నారు. తన్మయ కవిత్వం అన్నారు. మన కాలపు జిబ్రాన్‌ అన్నారు. ఇన్ని రకాలుగా బివివి కవిత్వాన్ని వర్ణించడం వలప దానికి మేలుకన్నా కీడే ఎక్కువ జరిగింది అని నా భావన. అందుకే వాటన్నిటినీ నేను పక్కనపెట్టి దీన్ని ‘అనుభవ కవిత్వం’ లేకపోతే ‘అనుభూతి కవిత్వం’ అంటాను. అయితే బివివి రాసే పద్ధతి వేరు.‘ఆరాధన’ కవితా సంపుటితో తెలుగు కవిత్వంలో 1989లో ప్రవేశించినా, హైకూల కవిగానే ప్రఖ్యాతి గాంచాడు. హైకూలని తెలుగులోకి విరివిగా తీసుకొచ్చింది ఇస్మాయిల్‌ గారయితే, ఆయన్ని మించి హైకూని అభ్యసించి, రచించి మెప్పిం చినవాడు ఈ కవి. తింటే గారెలు తినాలి అన్నట్టు చదివితే బివివి హైకూలు చదవాలి అని చాలా మంది పేరుగాంచిన కవులే అనడం విన్నాను.

హైకూ ముఖ్యంగా అనుభవ కవిత్వం. కానీ అందులో ఇంద్రి యాతీత అనుభవానికే ప్రాము ఖ్యత. ఇస్మాయిల్‌గారు హైకూ అంటే చంద్రుణ్ణి చూపించే వేలు అంటారు. దీని అర్థం ఏమిటంటే చంద్రుడ్ని చూపించాక ఎలాగైతే వేలు అవసరం లేదో, హైకూలో అనుభూతి కలిగాకా వస్తువు తను అదృశ్యమయిపోతుంది. వాన వెలిసింది తీగపై చిన్ని ప్రపంచాలు వేలాడుతున్నాయి (‘దృశ్యాదృశ్యాలు’లో హైకూ)ప్రకృతి పట్ల ఆరాధన, ప్రాపంచిక విషయాలపట్ల విముఖత, ప్రపంచం అశాశ్వతం అనే జాగృతి, అపారమైన కరుణ ఇవి కలిగి వుంటే గానీ ‘హైకూ’లని రాసి మెప్పించలేరు. ఈ లక్షణాలే అతని కవిత్వానికి పునాది. 1999 తరవాత బివివి హైకూలు రాయడం మానేసాడు. హైకూలు రాసిన కవులు వేరే రూపాల్లోకి వెళ్ళడం అరుదు. ఇస్మాయిల్‌గారు హైకూల్లోకి వెళ్ళాకా పెద్ద కవితలు అతితక్కువగా రాశారు. హైకూలో కొన్ని వస్తు పరిమితులు వున్నాయి. అన్ని వస్తువుల మీదా హైకూలో కవిత్వం చెప్పడం కష్టం.