తిక్కన కాలం నుండీ తెలుగు సాహిత్యం, అప్పటి పద్య సాహిత్య నియమాలకు లోబడి చేసే సద్విమర్శను కూడా పనికి రానిదిగానే నిర్ధారించి- అలాంటి ప్రయత్నాలను ‘కుకవులు’ మాట్లాడే చేతకాని ఈసడింపు మాటలుగా, సర్వాన్ని అందులోకే నెట్టివేయడం ద్వారా, అది తెలుగు సాహిత్య పురోగతికి ఎంతమాత్రమూ ‘అభిలషనీయమైన తరగతి కాదు’ అనే ముద్రను వేసి - దూరంగా పెట్టింది.

 

పూర్వసాహిత్యంలో నన్నయ తప్ప మిగిలిన కవులందరూ తమ తమ కావ్యాలలో ఒక నియమంగా ‘కుకవి నింద’ చేశారు. తనకు ముందు తెలుగు భాషలో కవిత్వంగా చెప్పుకోదగిన పద్య రచనలు శాసనాలలో కనిపిస్తూవున్నప్పటికీ, తెలుగులో వెలసిన కావ్యాలలో తనదే మొదటి రచన కావడం వలన, నన్నయకు భారత ఆంధ్రీకరణ అవతారిక రచించే సమయంలో ‘కుకవి నింద’ నియమానికి సంబంధించిన ఆలోచనే కలిగివుండక పోవచ్చునని అనుకోవడం సహేతుకమే అవుతుంది. తిక్కన నాటికి సాహితీ సంరంభాలలో ‘కుకవుల’ను గురించిన ప్రస్తావన స్పష్టంగా మొదలయింది. కవులలో ఈ ‘కుకవుల’నేవారు ఎవరు? వారి గుణగణాలేమిటి అనే సందేహానికి సమాధానంగా అన్నట్లుగా, తిక్కన తన ‘నిర్వచనోత్తర రామాయణం’లో ‘కుకవుల’ను ఇలా వర్ణించాడు:
 
చ. పలుకులపొందు లేక రస భంగము సేయుచుఁ బ్రాఁతవడ్డమా
టలఁ దమనేర్పు చూపి యొకటన్‌ హృదయం బలరింపలేక యే
పొలమును గానియట్టి క్రమముం దమమెచ్చుగ లోక మెల్ల న
వ్వులఁ బొరయం జరించు కుకవుల్‌ ధరదుర్విటులట్ల చూడఁగాన్‌.
 
చెప్పేవిషయంలో స్పష్టత లేకుండా, రసభంగం కావిస్తూ, పాతబడిపోయిన విషయాలలో రచనలు చేయడంలోనే తమ నేర్పును చూపిస్తూ (అంటే అప్పటికే కావ్యంగా వచ్చిన విషయంపైనే మరో కొత్త రచన చేయడంలోనే తమ ప్రజ్ఞను వొలకబోస్తూ) సాహిత్యానికి సంబంధించిన ఏ ఒక్క విషయంలోనూ పాఠకుని హృదయాన్ని అలరించే విధంగా రచనను చేయలేక, ఒక పద్ధతికి లోబడనితనమే తమ గొప్పతనంగా చెప్పుకుంటూ లోకం దృష్టిలో నవ్వులపాలవుతూ చరించే వారే ‘కుకవులు’ - అని పై పద్యం భావం. ఇంత వివరమైన ఈ వర్ణన వలన క్రీ.శ.13వ శతాబ్దంనాటికి తెలుగులో కవులతో పాటుగా ‘కుకవులు’ కూడా తగిన సంఖ్యలో వృద్థి చెందారని తిక్కనగారి పద్యం వలన తెలుస్తుంది. వృద్ధి చెందితే చెందేరుగాక, వారి మానాన్న వారిని పోనీక, ప్రత్యేకంగా పనిగట్టుకుని వారిని గురించి ఒక పద్యం నిండుగా పేర్కొనాల్సిన అవసరం తిక్కనగారికి ఎందుకు కలిగింది? అనేది ప్రశ్న. దానికి సమాధానంగా మనకు అర్థమయేదేమిటంటే, ఈ ‘కుకవి’ అనే వ్యక్తి తన మానాన్న తన రచనలేవో చేసుకుని ఊరుకోక, తాను కూడా కవి కావడం వలన, ఆ ప్రజ్ఞతో, ఇతరుల రచనల జోలికీ వెళ్ళి, వాటిలో తనకు తోచిన తప్పులను లోకానికి ఎత్తి చూపే పనీ చేసేవాడని అవగతమవుతుంది.
 
ఇప్పటి మాటలలో చేప్పాలంటే, ఇతడు సాహిత్య ‘విమర్శకుడు’ అనబడతాడు.   అయితే, ‘కుకవి’లో ఈ ఉదాత్త విమర్శకుడిని గుర్తించి వానికి తగిన స్థానాన్ని సాహిత్య వ్యాసంగాలలో కల్పించడానికి అప్పటి తెలుగు సాహిత్యం ఇంకా సిద్ధంగా లేదు. అప్పుడే కాదు, ఆ తరువాతి కాలంలో కూడా, సాహిత్య వ్యాసంగానికి సంబంధించిన కార్యకలాపాలలో ఒక క్రియాశీలమైన భూమికను పోషించగలిగే ‘విమర్శకుడ’నే విలక్షణపాత్రధారుడిని తయారుచేసుకునే విచక్షణను పూర్వ తెలుగుసాహిత్యం ఎప్పుడూ చూపలేదు. చేవలేని, లక్షణబద్ధం కాని కవిత్వం చెబుతూ, లోకుల నోళ్లలో నవ్వులపాలవుతూన్నవాడిగా సృష్టించబడి అప్పటికే నిందలపాలవుతున్న ‘కుకవి’ పాత్రధారుడి అస్తిత్వంలోకే, అర్థవంతమైన విమర్శ చేయగలిగి సాహిత్యానికి మేలు చేసే వీలున్న ‘విమర్శకుడి’ని కూడా తోసేసి తన ‘అవిచక్షణ’ను చాటుకుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.