హైదరాబాద్‌లో ధనికొండ కథాసాహిత్యంపై శతజయంత్యోత్సవ సదస్సుఏ సమాజంలోనైనా భౌగోళిక సామాజిక పరిస్థితులు, నైసర్గిక పరిస్థితులు ఆ ప్రాంత సాహిత్యంలో ప్రతిఫలిస్తాయి. వలసపాలన నేపథ్యంలో, 19వ శతాబ్దం ద్వితీయార్థంలో ప్రజాస్వామ్య, అభ్యుదయ భావజాలం మన దేశాన్ని పెద్ద మలుపు తిప్పింది. మన సంస్కృతీ సంప్రదాయాలు, భాషా సాహిత్యాలు, నిత్యజీవితాంశాలను పునఃసమీక్షించే ప్రక్రియంలో భాగంగా రాజా రామ్మోహన్‌రాయ్‌, కందుకూరి, గురజాడ తమదైన ముద్ర వేశారు. అదే స్పృహతో సామాజిక ప్రయోజనాన్ని ఆశించి తెలుగునాట శ్రీశ్రీ, చలం, కొడవటిగంటి కుటుంబరావు లాంటివారు తమ సృజనతో సాహిత్యాన్ని ప్రజాస్వామ్యీకరణ చేశారు.ఆ కోవకు చెందినవారే బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ కథ, నవల, నాటక రచయిత, అనువాదకుడు, పత్రికా సంపాదకుడు, ముద్రాపకుడు ధనికొండ హనుమంతరావు. స్ర్తీ పురుష సంబంధాలు, మనిషిని శాసించే విలువల చట్రం వంటి అనేకాంశాలను ఆయన కథల్లో ఆవిష్కరించారు. తెనాలి నుంచి మద్రాసు వెళ్ళి స్థిరపడి విస్తారంగా సాహిత్యాన్ని (1940–70) సృజించారు. మద్రాసులో స్థిరపడటంవల్ల రచయితగా తెలుగునాట ప్రచారం కొరవడి ఆయన సాహిత్య విశిష్టత తాత్కాలికంగా మరుగునపడింది.

ధనికొండ హనుమంతరావు శతజయంతి సంవత్సరం(4,మార్చి 2019–11మార్చి 2020) సందర్భంగా ఆయన సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో, 1మార్చి, 2020 ఆదివారంనాడు ధనికొండ కథాసాహిత్యంపై ఒకరోజు సదస్సు జరిగింది.ఎనభైయేళ్ళనాటి ధనికొండ కథలు చరిత్రగర్భంలో కలిసిపోకుండా కాలంతో పోటీపడి, 21వశతాబ్దంలో కొత్తతరం పాఠకులను కూడా అలరిస్తున్నాయని వక్తలు పేర్కొన్నారు.ఆంధ్రజ్యోతి దిన పత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్‌ సారథ్యంలో ఉదయంపూట జరిగిన సదస్సులో ప్రముఖ చరిత్ర పరిశోధకుడు వకుళాభరణం రామకృష్ణ, సుప్రసిద్ధ కథాపరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ ప్రసంగించారు. ధనికొండ హనుమంతరావు మేనకోడలు గోపరాజు సుధ ఈ సదస్సుకు స్వాగతం పలికారు.చలం పొడిగింపే ధనికొండ‘చలం పొడిగింపే ధనికొండ’ అన్నారు వకుళాభరణం రామకృష్ణ. విదేశీ సాహిత్యం చదువుకున్న ధనికొండ చలం కంటే ఇంకా ముందుకు వెళ్ళి శాస్త్రీయంగా ఆలోచించారనీ, స్ర్తీ కోరికలు, లైంగిక సమస్యల గురించి రాశారనీ అన్నారు. ధనికొండ సాహిత్య విశిష్టతను ఆ కాలం ప్రముఖులెవరూ గ్రంథస్థం చేయకపోవడం దురదృష్టకరమన్నారు.