తమిళ్ భాష ప్రపంచానికి అందించిన అంతర్జాతీయ స్థాయి వ్యక్తి , కవి సుబ్రమణియ బారతి (1882 - 1921). సార్వజనీనత, సార్వకాలికతలతో విలక్షణమైన వ్యక్తిగా బ్రతికారు. మహోన్నతమైన కవిత్వం వ్రాశారు. మహనీయులు, మహాకవి సుబ్రమణియ బారతి. వారి వర్ధంతి ఇవాళ (11-09-2019)‌. వారిపై ఆలోచన చేద్దాం రండి..

ఇవాళ  తమిళ్ భాషకు మహాకవి సుబ్రమణియ బారతి ఒక కేతనం. భావన, రచనాసంవిధానాల పరంగా అత్యంత ఔన్నత్యాన్ని ఆవిష్కరించారు బారతి. సాంఘీక అసమానతలకూ, స్త్రీ అణిచివేతకూ, కులాలకూ అతీతంగా  బ్రతికారు. ఇంగ్లిష్ వాళ్లను ఎదిరించిన‌ స్వాతంత్ర్య సమరయోధులు బారతి. ఒక ధిక్కార నాదం, ఒక సామాజిక దీపం, ఒక సంస్కార గీతం బారతి‌.
 
దేశభక్తి , జాతీయ, అంతర్జాతీయ భావనలు, ప్రేమ, తాత్త్వికత , దైవ‌భక్తి, సామాజిక స్పృహ , ఇతి హాసాలు , పసిపిల్లలు ఇతివృత్తాలుగా గొప్ప రచనలు చేశారు. 1910 లోనే హైకు పై అవగాహన ఉండేది వారికి. దక్షిణభారత దేశంలో హైకుపై వారే తొలిసారి వ్రాశారేమో?
 
"ఏ వ్యక్తికైనా తిండిలేకపోతే జగత్తును ధ్వంసం చేసేద్దాం" అన్నారు.  
"వేల జాతులున్నాయి ఇక్కడ అయినా అన్యులు చొరబడడం ఏం నీతి?" అని ప్రశ్నించారు. 
"వందేమాతరం జయ వందేమాతరం -  ఆర్యభూమిలో నారీ మణులూ, నర సూర్యులూ చేసే వీర నినాదం వందేమాతరం" అని అన్నారు‌. 
"వందేమాతరం అందాం - మా‌ దేశమాతను పూజిస్తాం అందాం" ఆని‌ అన్నారు. 
"నా తల్లీ, తండ్రీ సంతోషంగా ఉన్నది ఈ దేశంలోనే" అని అన్నారు. 
"తియ్యనైన ఊపిరినిచ్చి కని పెంచి అనుగ్రహించింది ఈ దేశమే" అని అన్నారు.

ఒక గొప్ప స్వాప్నికులు, దార్శనికులు బారతి‌. ఇదిగో ఇలా ...
 
"వెండి మంచుకొండపై విహరిద్దాం.. " ,
 "పాఠశాలలన్నిటినీ ఆలయాలు చేద్దాం ..",
  "సింహాళ దీవికి ఓ వారధి కడదాం... ",
 "రామ సేతువును పైకి తీసి వీధిని వేద్దాం..." ,
 "సిందు నదిపై‌ వెన్నెలలో చేరదేశపు కన్యలతో
 సుందర తెలుగులో పాటలు పాడి పడవలు నడిపి ఆడుకుని‌ వద్దాం ..."  అన్నారు‌.
  
జాతీయ సమగ్రతను పెంపొందిచే రీతిలో..
"కాశి నగర పండితుల ప్రసంగాల్ని కంచిలో  వినడానికి ఒక పరికరాన్ని చేద్దాం" అని  అన్నారు.
 "విశ్రమించడం చెయ్యం, తలవంచడం చెయ్యం.." అని అన్నారు.
 "చంద్రమండలంలో  చూసి తెలుసుకుందాం" అన్నారు. 
"ఏనాడు చల్లారుతుంది మా స్వాతంత్ర్య దాహం? ఏనాడు చచ్చిపోతుంది మా బానిసత్వపు మోహం? ’’అని ఆవేదన చెందారు బారతి. దేశానికి స్వతంత్రం రాక మునుపే స్వతంత్రం వచ్చేసినట్టుగా పాటలు పాడారు బారతి.‌ 
 
ఈ‌ సంఘంలోని మనుషులు కొందఱిని చూశాక ...
 
"మనసు తట్టుకోలేకపోతోందే ఈ స్థితి‌ చెడిన‌‌ మనుషుల్ని తలుచుకుంటే" అని అన్నారు‌. 
"మనసులో‌‌ బలమూ లేక, నిజాయితీ ఉన్న ప్రతిభా లేక వంచన చెబుతారమ్మా‌ చిలకా, నోటిమాటల వీరులమ్మా" అని అన్నారు.
"భయాన్నీ , పేడితనాన్నీ , బానిసత్వపు తక్కువ తనాన్నీ ఉచ్చస్థాయిలో కలిగి ఉన్నారమ్మా  చిలకా, మూగ జనాలమ్మా," అని అన్నారు. 
 
"నిప్పురవ్వ నొకదాన్ని చూశాను, దాన్ని
అక్కడో అడవిలోని కలుగులో పెట్టాను
కాలి చల్లారిపోయింది అడవి
నిప్పు వీరానికి లేతదనీ, ముదురుదనీ ఉంటుందా?" అని అన్నారు బారతి. 
  
ఒక‌‌‌ సందర్భంలో  ఇలా అన్నారు బారతి:
 
"తిండిని వెతుక్కుంటూ రోజూ తిని
ఏవేవో అల్పమైన కథలు‌ చెప్పుకుని
మనసు ఒడిలి
బాధల్ని అనుభవించి
ఇతరుల్ని బాధించేవెన్నో చేసి
తల నెఱుపు వచ్చి 
ముసలి తనాన్ని పొంది
ఘోరమైన మరణానికి బలై మాసిపోయే
పలు విదూషకుల్లా నేను కూలిపోతాననుకున్నావా?"
 
మఱో సందర్భంలో ...
పగవాడిని కరుణించు - మంచి మనసా!
పగవాడిని కరుణించు!
పొగ మధ్యలో నిప్పు ఉండడాన్ని
భూమిపై చూశాం కదా మంచి మనసా!
భూమిపై చూశాం కదా.
పగ మధ్యలో అనురాగం పుడితే
పరమాత్మ‌ జీవిస్తాడు మంచి మనసా!
పరమాత్మ‌ జీవిస్తాడు" అని అన్నారు. ఎంత పండిన మనసు వారిది?
"స్త్రీ‌ స్వేచ్ఛ కావాలి" అని కాంక్షించారు. "మగువల్ని ఎగతాళి చేసే మూర్ఖత్వాన్ని కాల్చేద్దాం" అన్నారు.
  
అత్యున్నతమైన ప్రేమ కవిత్వం చెప్పారు బారతి‌‌ ఇదిగో ఇలా...
 దూసుకు వచ్చే వెలుగు నువ్వు నాకు, చూసే చూపు నేను నీకు;
తడిపేసే మధువు నువ్వు నాకు, తుమ్మెద నేను నీకు;