కన్నీరు పెడుతోంది..

ఇల్లు కన్నీరు పెడుతోంది

నిన్ను బ్రతికించుకొంటే చాలని
ఇల్లు కన్నీరు పెడుతోంది!
నువ్వు ఇంటి పట్టునే ఉంటే మేలని
తంటాలు పడుతోంది
ఇల్లు తంటాలు పడుతోంది.
 
కాళ్ళకు చక్రాలు కట్టుకొని నువ్వు కాటికి కాలు చాస్తూ ఉంటే
రెండుచేతులా కరోనావైరస్ సంపాదించీ తెస్తూ ఉంటే
కన్నపేగునే తెంపినట్లుగా కంటిపాపలో గుచ్చినట్లుగా
కన్నీరు పెడుతోంది  ఇల్లు కన్నీరు పెడుతోంది 
 
కొంపకొల్లేరు అవుతూ ఉంటే బయటకెందుకో పిచ్చితండ్రీ

ఇంటి దీపమే ఆరిపోతుంటే అర్థం కాదా వెర్రినాయనా

నీ నిర్లక్ష్యం నీ అలసత్వం నీ మూర్ఖత్వం అమాయికత్వం

లక్షల ప్రాణాల తీస్తాయంటూ

కన్నీరు పెడుతోంది

ఇల్లు కన్నీరు పెడుతోంది.

 
గుంపుగ వెళ్తే గోవిందేనని,  చేతులు శుభ్రం చేసుకోమని
కలో గంజో ఇంటిపట్టునే తిని బ్రతికుంటే అంతే చాలని
కిటికీ మూసి తలుపులు వేసి గొళ్ళెం పెట్టి పంతం పట్టి
కన్నీరు పెడుతోంది
ఇల్లు కన్నీరు పెడుతోంది.
 
 
డా. అద్దంకి శ్రీనివాస్
ఫోన్ : 9848881838