ఉత్తమ ప్రదర్శనగా ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ 
నాగిరెడ్డికి రంగస్థలనాటక సేవారత్నపురస్కారం అందజేత


ద్రాక్షారామ,తూర్పు గోదావరి:ద్రాక్షారామ నాటక కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ద్రాక్షారామలో జరిగిన రాష్ట్ర స్థాయి నాటిక పోటీలలో కేజేఆర్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ప్రదర్శించిన ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. మంగళవారం రాత్రి ‘కేవలం మనుషులం’ నాటిక ప్రదర్శనతో నాటిక పోటీలు ముగిసాయి. అనంతరం విజేతలను న్యాయనిర్ణేతలు ప్రకటించారు. ద్వితీయ ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్‌ వారి కేవలం మనుషులం నాటిక ఎంపికైంది. తృతీయ ప్రదర్శనగా ఉషోదయ కళానికేతన్‌ కట్రపాడు వారి గోవు మాలచ్చిమి ఎంపిక చేశారు. ఉత్తమ నటుడిగా ఎవరిని ఎవరు క్షమించాలి నాటికలో పుణ్యదాసు పాత్రదారి జోగారావు, ఉత్తమ నటిగా గోవు మాలచ్చిమి నాటికలో వెంకట లక్ష్మి పాత్రదారి ఎస్‌.అమృత వర్షిణి, ఉత్తమ దర్శకుడిగా ఎవరిని ఎవరు క్షమించాలి నాటిక దర్శకుడు ఉదయ్‌ భాగవతులు ఎంపికయ్యారు. ఉత్తమ రచనగా కేవలం మనుషులం శిష్టా చంద్రశేఖర్‌, ఉత్తమ సంగీతం గోవుమాలచ్చిమి నాటికకు పి.లీలా మోహన్‌, ఉత్తమ విలన్‌గా చేతిరాత నాటికలో గోవిందరాజు పాత్రధారి పి.భద్వేశ్వరావు, ఉత్తమ క్యారెక్టర్‌ నటుడుగా కేవలం మనుషులం నాటికలో మీర్జాఆలీఖాన్‌ పాత్రదారి వీసీహెచ్‌కె ప్రసాద్‌, ఉత్తమ ద్వితీయ నటి చేతిరాత నాటికలో దుర్గ పాత్ర దారి ఎల్‌.పద్మావతి, ద్వితీయ నటుడు గోవుమాలచ్చిమి నాటికలో నారాయణ పాత్రదారి చిరుకూరి సాంబశివరావు ఎంపికయ్యారు.
 
నాటక రంగానికి అంకితమైన నాగిరెడ్డి: ఎమ్మెల్సీ చిక్కాల 
1965లో దుర్గా ఆర్ట్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ స్థాపించి నటుడిగా, ద్రాక్షారామ పరిషత్‌ నిర్వహణతో నాటక రంగానికి అంకితమయ్యారని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు అన్నారు. మంగళవారం రాత్రి రంగస్థల నాటకరంగ దినోత్సవం పురస్కరించుకుని ద్రాక్షారామ నాటక కళాపరిషత్‌ అధ్యక్షుడు నాగిరెడ్డి సత్యన్నారాయణకు రంగస్థల సేవారత్న పురస్కారం అందచేశారు. కార్యక్రమంలో చిక్కాల మాట్లాడుతూ నాగిరెడ్డి వృత్తిరీత్యా కండక్టర్‌గా పనిచేస్తూ 50 ఏళ్లుగా నాటక రంగానికి ఎనలేని సేవ అందించారని కొనియాడారు. డా. స్టాలిన్‌ మాట్లాడుతూ ద్రాక్షారామ నాటక కళాపరిషత్‌ పూర్తిగా కళాకారులు, ఉపాధ్యాయులచే నడుపుతున్న ఏకైక పరిషత్‌ అని, ఈ పరిషత్‌ కార్యక్రమంలో పాల్గొనడం గర్వపడతానన్నారు. కళకారుడిగా, పరిషత్‌ అధ్యక్షుడిగా నాగిరెడ్డి కళరంగానికి ఎంతో సేవ చేశారన్నారు. జబర్దస్ట్ కళాకారుడు అప్పారావు మాట్లాడుతూ పరిషత్‌ నిర్వహణ ఎంతో కష్టతరమని, ఇన్నేళ్లుగా పరిషత్‌ నిర్వహిస్తున్న నాగిరెడ్డి ఇతర కార్యవర్గం చేసిన కృషి కొనియాడారు. సమావేశంలో జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ చింతపల్లి వీరభద్రరావు, నటుడు, నిర్మాత ఆళ్ల రాంబాబు, ఆర్టీసీ డిపో రిటైర్డ్‌ మేనేజర్‌ చింతపల్లి ఈశ్వరావు తదితరులు నాగిరెడ్డి సేవలు కొనియాడారు. అనంతరం నాగిరెడ్డి సత్యన్నారాయణను ఘనంగా సత్కరించి రంగస్థల సేవారత్న పురస్కారం అందచేశారు. ద్రాక్షారామ పరిసర ప్రాంతాలకు చెందిన కళాభిమానులు నాగిరెడ్డిని పూలమాలలతో సత్కరించారు. పరిషత్‌ ఉపాధ్యక్షుడు కొండ, కార్యదర్శి సినీ నటి సరోజ, కన్వీనర్‌ నాగిరెడ్డి సతీష్‌, వేమవరపు రాంబాబు, కోశాధికారి అయినవిల్లి సతీష్‌, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.