బర్కత్‌పుర, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ నూరు వసంతాల ఉత్సవాల సందర్భంగా నిజాం కళాశాల, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అసోసియేషన్‌ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో ‘తెలంగాణ పాట- సమగ్ర ఆలోచన’ అనే అంశంపై రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌రాథోడ్‌ తెలిపారు. ఈ నెల 7, 8 తేదీలలో నిజాం కళాశాల ఆడిటోరియంలో ఈ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7న ఉదయం 10గంటలకు ఈ సదస్సును ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ గోపాల్‌రెడ్డి ప్రారంభిస్తారని, ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్‌ నందిని సిధారెడ్డి పాల్గొంటారని తెలిపారు. 8వ తేదీ సాయంత్రం 4.40లకు జరిగే ముగింపు సభకు తెలంగాణ ప్రెస్‌అకాడమీ అధ్యక్షులు అల్లంనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు.