చిక్కడపల్లి, జూలై2(ఆంధ్రజ్యోతి): చిందు కళాకారుల జీవితాలను సజీవంగా చిత్రించిన నవల కొంగవాలు కత్తి అని, ఈ నవలలోని జీవితం తనదేనని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారవిజేత 2019, ఉస్మానియా యూనివర్సిటీ కోఠి మహిళా కళాశాల లెక్చరర్‌ డా. గడ్డం మోహన్‌రావు అన్నారు. వంగూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి త్యా గరాయగానసభలో నెలనెలా తెలుగు వెన్నెలలో భాగంగా 154వ కార్యక్రమంగా నవల కొంగవాలు కత్తి అనే అంశంపై గడ్డం మోహన్‌రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో సన్మా నం అందుకున్న ఆయన మాట్లాడుతూ ఇది తన ఆత్మకథాత్మక నవల అన్నారు. త్రిమూర్తుల పెళ్లి కోసం విశ్వకర్మ ఆదిజాంబవంతునికి కొంగవారు కత్తిని ఇచ్చారన్నారు. ఈ నవలను తాను 45 రోజుల్లో రాశానన్నారు. ఈ నవలా రచన చిందు కళాకారుల జీవితాలు, చిందు భాగవతం నేపథ్యంలో సాగుతుందన్నారు. తెలంగాణా ప్రాంతంలో ఒకనాడు దేదీప్యమానంగా వెలుగొందిన చిందు కళ నేడు తీవ్రదుస్థితిని ఎదుర్కొంటుందన్నారు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ సంపాదకులు, కార్యనిర్వహణాధికారి డా.పత్తిపాక మోహన్‌ మాట్లాడుతూ  కటిక పేదరికాన్ని అనుభవిస్తూ చిందు కళారూపాలను తమ జీవితంగా భావిస్తూ సంచారజీవితాన్ని గడిపే చిందు కళాకారుల ఇంటిలో డా. మోహన్‌రావు జన్మించారన్నారు. కులవివక్ష, పేదరికాన్ని అనేక ఆటుపోట్లను తట్టుకుని ఉన్నత విద్యావంతుడై, ఉస్మానియా యూనివర్శిటీ నుంచి అత్యున్నత డాక్టరేటు డిగ్రీని అందుకున్న తొలి చిందు విద్యార్థిగా రికార్డును సృష్టించడంతో ఈ నవల ముగుస్తుందన్నారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా మేనేజింగ్‌ ట్రస్టీ డా. వంశీ రామరాజు మాట్లాడుతూ చిందు కళాకారుల ఆర్థిక, సామాజిక అంశాలను, సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చిత్రించిన నవల కొంగవాలు కత్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ డా.తెన్నేటి సుధాదేవి,  ట్రస్టీ సుంకరపల్లి శైలజ, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, గాయని సుజారమణ తదితరులు పాల్గొన్నారు.