చిక్కడపల్లి, అక్టోబర్‌20(ఆంధ్రజ్యోతి): మహాకవి శేషేంద్ర రచనలు ఎంతో గొప్పవని వక్తలు పేర్కొన్నారు. గుండ్లకమ్మ రచయితల సంఘం ఆధ్వర్యంలో మహాకవి శేషేంద్రశర్మ 92వ జయంతి సాహిత్య సదస్సు ఆదివారం సాయంత్రం త్యాగరాయగానసభలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డా. నందిని సిధారెడ్డి హాజరై మాట్లాడుతూ గుంటూరు శేషేంద్రశర్మ రచనలు ఎంతో ఆసక్తిగా ఉంటాయన్నారు. మహాకవిగా శేషేంద్రశర్మ ఎంతో పేరును సంపాదించారన్నారు.  40కిపైగా రచనలు చేశారన్నారు. సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప కవి అని కొనియాడారు. ఆధునిక సాహిత్యానికి ఆయన  దిక్సూచి లాంటివారన్నారు. తెలుగు సాహిత్యంలో ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం అని అన్నారు. అలంకార శాస్త్రాలను ఔపోసన పట్టిన పండితులని, ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ఆయనది విశ్వమానవ దృష్టి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రామకవచం సాగర్‌ కీలకోపన్యాసం చేయగా కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ హిందీ ఆచార్యులు వై.వెంకటరమణారావు నిర్వాహక సంస్థ కన్వీనర్‌ కాట్రగడ్డ దయానంద్‌, సాత్యకి తదితరులు పాల్గొన్నారు.