చిక్కడపల్లి, అక్టోబర్‌ 16(ఆంధ్రజ్యోతి): అమ్జద్‌ రచించిన ‘తొలకరి చినుకులు’, ‘పూలచాదర్‌’ కథా సంపుటుల ఆవిష్కరణ బుధవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. అతిథిగా పాల్గొన్న సాహితీవేత్త కె.శివారెడ్డి పుస్తకాలను ఆవిష్కరించి మాట్లాడుతూ భౌతిక అవసరాలు తీరాక మానసిక ఆనందం కోసం కళలు, సాహిత్యంవైపు చాలా మంది వస్తుంటారని అన్నారు. ఇది ఆదిమ మానవుడి నుంచి కొనసాగుతూ వస్తుందన్నారు. ఆదిమ మానవ సమాజంలో కూడా కళలవైపు మొగ్గుచూపారన్నారు. సాహిత్యం, కళలపై మక్కువ పెంచుకోవడం వల్ల ఆత్మసంతృప్తి, మానసిక ఉల్లాసం, ఆనందం కలుగుతాయన్నారు. రచయిత అమ్జద్‌ మంచి కవితలు రచించారన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ అమ్జద్‌ రచన ఆకట్టుకునేలా ఉందన్నారు. పాఠకులను కదిలించే కథ రాయడం ఒక కళ అన్నారు. క్లుప్తంగా, సంక్లిప్తత పాటిస్తూ పాత్ర పరిణామక్రమాన్ని సమన్వయంతో రాయడం నిజమైన పరీక్ష అన్నారు. దీనిలో సాఫల్యం చెందిన రచయిత అమ్జద్‌ అన్నారు. కవి యాకూబ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నారాయణశర్మ, వాహెద్‌, గుడిపాటి తదితరులు పాల్గొన్నారు.