విజయనగరం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ప్రముఖ వీణ విద్వాంసురాలు మండా మాణిక్యం(78) సోమవారం రాత్రి కన్నుమూశారు. విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వీణ వాయిద్య విద్యను అభ్యసించిన ఆమె అదే కళాశాలలో వీణ అధ్యాపకురాలిగా పనిచేశారు. పద్మశ్రీ ద్వారం వెంకటస్వామినాయుడు వద్ద శిష్యురాలిగా, వాసావారి సంగీత సంప్రదాయానికి ప్రతినిధిగా మణిక్యం అనేక రేడియో కచేరీలు చేశారు. ఆమె శిష్యులు అనేక మంది దేశ, విదేశాల్లోనూ స్థిరపడ్డారు. అనేక సంస్థల నుంచి సన్మానాలు, సత్కారాలు అందుకున్న మాణిక్యం మృతికి పలువురు కళాకారులు సంతాపం తెలిపారు. కళాశాల నిర్వాహకులు, పూర్వ విద్యార్థులు ఆమె మృతి పట్ల దిగ్ర్భాంతి చెందారు.