సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డిసిద్దిపేట, జనవరి 28 : అంశం ఏదైనా సమాజం గుర్తు పెట్టుకునే కథలు రాయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ సాహిత్య అకాడమీ, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కథా రచన అంశంపై నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ ప్రారంభ సమావేశం సిద్దిపేటలో జరిగింది. ఈ సమావేశంలో సిధారెడ్డి మాట్లాడారు. కథకుడు ఏది చెప్పినా ప్రజల హృదయాలను తాకేలా ఉండాలన్నారు. పాత పద్దతిలో కథలు చెప్తే ఎవరూ వినరని చెప్పారు. అందరూ కథలు రాస్తారని, అయితే గొప్పగా రాసేవారు కొందరే ఉంటారని పేర్కొన్నారు.బతుకమ్మ పండుగ సంస్కృతిని, తెలంగాణ ప్రాంత కథకుల కృషిని, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కథా నేపథ్యాన్ని అందించిన తీరును ఆయన వివరించారు. బండారు అచ్చమాంబ మొదలుకొని నేటి అల్లం రాజయ్య వరకు తెలంగాణ కథానిక స్వరూప స్వభావాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కథాశిల్పి ఐత చంద్రయ్య, కళాశాల ప్రిన్సిపాల్‌ డా.సి.హెచ్‌ ప్రసాద్‌, వర్క్‌షాప్‌ నిర్వాహకురాలు ఎన్‌.నిర్మల కుమారి, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ కార్యదర్శి డా.పత్తిపాక మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.