చిక్కడపల్లి, అక్టోబర్‌ 16(ఆంధ్రజ్యోతి): యువభారతి సంస్థ సాహితీసేవలు ప్రశంసనీయమైనవని ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అన్నారు. యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ 56వ వార్షికోత్సవ సభ బుధవారం సాయంత్రం త్యాగరాయ గానసభలో జరిగింది. సాహితీవేత్తలు విహారి, డాక్టర్‌ పుట్టపర్తి నాగపద్మిని, డాక్టర్‌ తిరుమల శ్రీనివాసాచార్య రచించిన ‘నాటక పద్యాలు’, ‘పుంభావ సరస్వతి- పుట్టపర్తి’, ‘అభినవ పోతన-వానమామలై’ పుస్తకాలను రమణాచారి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఒక సాహితీ సంస్థ 56వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ సంస్థ నిర్వాహకుడు వంగపల్లి విశ్వనాథం ఎంతో గొప్పగా సంస్థను నడుపుతున్నారని కొనియాడారు. మహాత్మా గాంధీ మహనీయతను తెలియజేస్తూ ఒక బుక్‌లెట్‌ను రూపొందించి లక్షప్రతులకుపైగా ముద్రించి గాంధీ జయంతి రోజున రాష్ట్రవ్యాప్తంగా పంచడం విశేషమైన ప్రక్రియ అన్నారు. కేంద్రరాష్ర్టాలు చేయాల్సిన పనిని ఈ సంస్థ చేయడం ముదావహం అన్నారు. ఆవిష్కృతమైన మూడు పుస్తకాలు యువత చేతిలో ఉండాలని, మన సాహితీచైతన్యం భవిష్యత్‌తరాలకు తెలుస్తుందని దానివల్ల సమాజానికి కలిగే ప్రయోజనం మరింత అవగతం అవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి సుధామ, ఆచార్య ఫణీంద్ర, జీడిగుంట వెంకట్రావు పాల్గొన్నారు.