శరత్ ఆ ఆఫీసులో చేరిన రెండో రోజే తన క్యాబిన్‌ను ఆనుకునే ఉన్న ఉద్యోగుల విభాగంలో ఆ అమ్మాయిని చూశాడు.‘పొడుగ్గా తెల్లగా ఉంది. జడ బారుగా ఉంది. కోలముఖం. నుదుటిమీద వెలుగు రేఖలా మెరుస్తున్న నిలువు బొట్టు. ముఖంలో నైర్మల్యం.ఆమెను చూడగానే అతడికి పూజనీయ భావం కలిగింది. అతను ఆ ప్రభుత్వ రంగ సంస్థలో ఒక విభాగానికి అధికారి. ఆ ఆఫీసులో అతనికి అందరూ కొత్తే, జగదీష్ తప్ప. ఇద్దరూ ఒకే బ్యాచ్‌కు చెందిన డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్లు. లంచ్ బ్రేక్‌లో జగదీష్ క్యాబిన్‌లో ఇద్దరూ కలిసి భోంచేస్తున్నారు. ‘‘ఆ అమ్మాయి చాలా బావుంది...పేరు’’ అన్నాడు శరత్ కళ్ళతోనే తన మనసును తట్టిన ఆ అమ్మాయిని చూపిస్తూ.‘‘అమ్మాయా?!’’ అన్నాడు జగదీష్ ఆశ్చర్యంగా. ‘‘ఏంటీ అంత ఆశ్చర్యపోతున్నావ్?’’ అన్నాడు శరత్ మిత్రుడి వంక పరిశీలనగా చూసి.‘‘నువ్వు అమ్మాయి అంటుంటే ఆశ్చర్యమేసింది. అయితే ఆవిడ అమ్మాయి కాదు, ఆమెకు పదేళ్ళ కొడుకున్నాడు. ఆమె పేరు మైథిలి’’ అన్నాడు జగదీష్ నవ్వుతూ.‘‘ఓ మైగాడ్, పదేళ్ళ కొడుకా, నమ్మశక్యంగా లేదు’’, అన్నాడు శరత్.‘‘నీకు ఇంకో ఆశ్చర్యం కలిగించే వార్త చెప్పనా ఆవిడ గురించి’’ అన్నాడు జగదీష్.శరత్ ప్రశ్నార్థకంగా చూశాడు. ‘‘ఆవిడను భర్త వదిలేశాడట. విడాకులు పుచ్చుకున్నారు’’ అన్నాడు జగదీష్. ‘‘ఇలాంటి ఏంజెల్‌ను వదులుకున్న ఆ ప్రబుద్ధుడు ఎవరో!’’ అన్నాడు మరింత ఆశ్చర్యంగా శరత్.‘‘ఏమో! ఆ వివరాలు నాకు తెలీదు’’ అంటూ భోజనం ముగించి వాష్‌రూమ్ వైపు కదిలాడు.శరత్ తన క్యాబిన్ లోకి నడిచి, ఆలోచనల్లో పడ్డాడు. ‘పాపం ఆమెదీ తనదీ ఒకే జీవితంలా ఉంది. ఆమెను భర్త వదిలేశాడు. భార్య తనను వదిలిపై లోకాలకు వెళ్ళిపోయింది. అతడి కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి.
చాలా సేపు చనిపోయిన తన భార్య గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు.ఫఫఫరెండు రోజుల తర్వాత శరత్‌కు ఆఫీసులో ఫంక్షనల్ చార్ట్ ఇచ్చారు. మైథిలిని అతడికి అసిస్టెంట్‌గా కేటాయించడంతో అతడికి ఆశ్చర్యం, ఆనందం రెండూ ఏకకాలంలో కలిగాయి. ఆమె అతడికి బాగా నచ్చేసింది. పని విషయంలో రాజీ పడదు. పది గంటలకే ఆఫీసుకు వచ్చేస్తుంది. ఐదున్నరకు వెళ్ళిపోతుంది. తన పని తప్ప దేంట్లోనూ తలదూర్చదు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. అందరినీ గౌరవిస్తుంది. ఒకరోజు లంచ్ టైంలో ఒక ఆవిడ బహుశా అరవయ్యేళ్ళు ఉంటాయేమో, లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీసుకు వచ్చింది. శరత్‌కు ఎవరో చెప్పారు. ఆ పెద్దావిడ మైథిలి తల్లిగారని. ఆవిడే, శరత్ రూమ్‌లోకి వచ్చి పరిచయం చేసుకుంది. తన కూతురు గురించి చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది.