కాలింగ్ బజ్జర్ మోగింది. పడక మీంచి లేచి వెళ్లి తలుపు తీసాడు కిషన్.‘‘అప్పుడే తెల్లారిందా?’’ నిద్ర కళ్ళతోనే ఆమెని చూస్తూ అడిగాడు.‘‘అవునయ్యగారూ! తెల్లగా తెల్లారిపోయింది అమ్మగారుంటే ఇంకాసేపు మీరు పడుకునే వారేమో? నే వచ్చి మిమ్మల్ని లేపేసినట్లున్నాను...’’నొచ్చుకున్నట్లు అంది లక్ష్మి.‘‘అదేం లేదు... ఆఫీసుకెళ్లేందుకు నేనూ తెమలాలి కదా!’’ అంటూ పక్కకు తొలిగి దారిస్తూ ఆమె లోనికి వచ్చాక తలుపులు మూసాడు. లక్ష్మి సరాసరి బెడ్ రూంలోకి వెళ్లింది. చిందరవందరగా ఉన్న పక్క బట్టలు సర్దడం ప్రారంభించింది. మొదట రగ్గు తీసి మడత పెట్టింది. బెడ్ మధ్యలోకి వచ్చిన తలగడకు గలీబు చక్కగా అమర్చి ఎక్కడుంచాలో అక్కుడుంచింది. టీపాయ్ మీద ఎంగిలి గ్లాసులు, మంచినీళ్ల చెంబుతీసి కిచెన్‌లోకి వచ్చింది. ఈలోపు బాత్‌రూం కెళ్లి బయట కొచ్చిన కిషన్ లక్ష్మి తన బెడ్ సర్దిన సంగతి గుర్తించి - ‘‘లక్ష్మీ... ఈ పనులన్నీ నీకెందుకు? అమ్మ గారు వచ్చే లోపల నా పక్క బట్టలు కూడా సర్దుకోలేనంత బద్ధకస్తున్ని చేసేలా ఉన్నావ్ నువ్వు...’’ అన్నాడు.‘‘అదేంటయ్య గారూ, అలాగంటారు. ఊరెళుతూ అమ్మగారు మిమ్మల్ని, ఈ ఇంటినీ నాకప్పగిస్తూ ‘ఒసే, లక్ష్మి! మా ఆయన వట్టి బద్ధకస్తుడు. ఆఖరికి అగ్గిపుల్ల వెలిగించి స్టవ్ వెలిగించడం అలవాటు లేని మనిషి. నే వచ్చేదాకా కాస్త జాగ్రత్తగా చూసుకో...’’ అన్నారండీ.
మీకెలాంటి అసౌకర్యం కలుగకుండా అమ్మగారికిచ్చిన మాట నిలబెట్టుకోవద్దూ?’’ ఎదురు ప్రశ్న వేసింది లక్ష్మి.‘‘తొలి కాన్పు.... పుట్టింట్లోనే చేయడం ఆనవాయితీ...’’ అంటూ అత్తగారు మరీమరీ చెప్పడంతో భార్యని ఆమె పుట్టింటికి పంపిచక తప్పలేదు కిషన్‌కి.‘‘ఆమె వచ్చేదాకా... సుమారు నాలుగు నెలల వరకూ బలవంతపు బ్రహ్మచర్యమే..’’ అనుకున్నాడతను.పెళ్లి కానప్పుడు ఇంతింట్లో ఉండే వాడు కాదు తను. ఆఫీసుకి దగ్గర చిన్నరూం తీసుకుని ఉండే వాడు. ఆకలేస్తే హోటల్‌లో ఇన్ని మెతుకులు కతకడం, సాయంత్రం ఆఫీసయ్యాక బోర్ కొట్టే వరకూ స్నేహితులు, సిన్మాలంటూ రోడ్డు పట్టుకు తిరగడం, ఏ అర్థరాత్రో, అలసిన శరీరాన్ని రూంకి చేరవేసి నిద్రలోకి జారుకోవడం...!బ్రహ్మచారి గది కదా! చదివి వదిలేసిన పేపర్లు, మేగజైన్ల ఎక్కడపడితే అక్కడే ఉండేవి. రూం దగ్గర్లోని టీ స్టాల్ నుంచి ఓ కుర్రాడు ప్రతి ఉదయం టీ తెచ్చేవాడు. టీ తాగిన తర్వాత ఆ గ్లాసులు తీసుకెళ్లడానికి వాడు బద్ధకించేవాడు. దాంతో, ఎండిపోయిన టీ చారికలతో, ఈగలు ముసురుతూ ఉండే గ్లాసులు ఆ రూంకి అలంకార ప్రాయమయ్యేవి.పెళ్లి చూపుల తర్వాత ఇంకా పెళ్లి కాకుండానే కిషన్‌ని చూసేందుకు ఒకసారి వచ్చి ఆశ్చర్యపోయింది రేఖ. కాసేపు ఆమాట ఈమాటలయ్యాక... కొత్త కాస్త పోయింది కామోసు... కాబోయే శ్రీమతి హోదాలో కాస్తంత కటువుగానే