గోవర్థనం గుడి దగ్గరకు వచ్చేసరికి గుడి ముందున్న అరుగు ఖాళీగా వుంది. నాలుగు కిలోమీటర్లు నడిచి వచ్చేసరికి అతను బాగా అలిసిపోయాడు. బస్సును సమయానికి అందుకోవాలనే తొందరలో అతడు కొంచెం వేగంగా నడిచాడు. ఆ గతుకుల మట్టి రోడ్డు మీద.అందువల్ల గుడి ముందున్న అరుగును చూడగానే వెళ్లి దాని మీద కూర్చున్నాడు. చేతిలో వున్న చిన్న జిప్ బ్యాగ్‌ను పక్కన పెట్టి అతను ఎక్కవలసిన బస్సు ఆ గుడిముందుకే వచ్చి ఆగుతుందని చెప్పాడు మురళీకృష్ణ-గోవర్థనం స్నేహితుడు.ఆ మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న పల్లెటూరిలో వుంటున్న స్నేహితుడు మురళీకృష్ణను చూడడానికి క్రితం రోజు ఉదయం రాజమండ్రి నుంచి ఆ వూరికి వచ్చాడు గోవర్థనం. తిరిగి వెళుతూ అక్కడకు వచ్చి ఆ అరుగు మీద కూర్చున్నాడు.ఎండ క్రమంగా బలహీనపడుతోంది. సాయంత్రం ఐదు గంటలు కావస్తున్నదపడు ఎండ అతనిమీద పడకుండా గుడి పక్కనే వున్న రావి చెట్టు నీడ అతను కూర్చున్న అరుగు మీద పడుతోంది.బస్సు రావడానికి ఇంకో పదినిమిషాలు టైం వున్నదనుకున్నాడు వాచీ చూసుకుని.గుడి ఎదురుగా రోడ్డుకు అవతల చిన్న పెంకుటిల్లు వుంది. ఆ ఇంటి పంచ ముందుకు వాలి వుంది. అందులో ఓ పక్కగా నులకమంచం వాల్చి వుంది. ఆ మంచం మీద ఓ వృద్ధ స్త్రీ కూర్చుని పత్తితో దీపారాధన చేసే వత్తులను చేస్తోంది.గోవర్థనంకు ఆమెను చూడగానే గబుక్కున తన తల్లి గుర్తుకు వచ్చింది. దాదాపుగా అదే వయసులో వుంది. తన తల్లికి చెల్లెలనో, అక్కయ్యనో అంటే ఎవరయినా సులభంగా నమ్ముతారు.ఆమెనే ఇంకొంచెం పరీక్షగా చూశాడు. ఆమె తన పనిలో లీనమై వుంది. ఇంట్లో ఆమె తప్పించి ఇంకెవరూ వున్న జాడలు కనిపించలేదు.గోవర్థనానికి తల్లి గుర్తుకు రావడంతో గోధుమ హల్వా కూడా గుర్తుకు వచ్చి మనసు అంతా అదోలా అయిపోయింది.
ఎందుకంటే గోవర్థనానికి చిన్నతనంలో అతడి తల్లి సాయంత్రం వేళ అతను స్కూలు నుంచి వచ్చేసరికి గోధుమ హల్వా చేసి వుంచి అతడు రాగానే దగ్గర కూర్చుని తినిపించేది. అతను ఎంతో ఇష్టంగా తినేవాడు.అతడికి గోధుమ హల్వా అంటే ఇష్టమని గ్రహించిన ఆ తల్లి ఈ అలవాటును చాలా రోజులు కొనసాగించింది. అతను కాలేజీలో చదువుతున్నపడు కూడా ప్రత్యేకించి అతనికోసమే గోధుమ హల్వాను చేసేది.ఆమెను చూస్తూ వుంటే గోవర్థనానికి ఆ రోజులు గుర్తుకువచ్చాయి. తన తమ్ముడు చెల్లెళ్లు తన కంటే వాళ్లకు హల్వా తక్కువ పెట్టిందని తల్లితో గొడవ పడేవాళ్లు. అయినా ఆమె తనకే ఎక్కువ పెట్టేది.