ఫట్‌ ఫట్‌ మని ఆమె మోకాళ్ళ మీద లాఠీ దెబ్బలు పడ్డాయి.‘‘అబ్బా... అమ్మా...’’ అని అరిచింది కాని, నవ్వుతూ అరిచింది మాయ. ఆమె జుట్టు గట్టిగా పట్టుకుని లేడి కానిస్టేబుల్‌ ‘‘చెప్పవే...’’ అని బూతు మాట ప్రయోగించి ‘‘నీతో పాటు వున్నాడే...ఆడేడి?’’ కటువుగా అడిగింది. చిరాగ్గా చూసి, నవ్వి అంది ‘‘నాతో పాటు ఎవరున్నారు? నా పాటికి మంచి నిద్రలో వుంటే...’’అని ‘‘ఆ గుర్తొచ్చింది అంతకు ముందు మాత్రం.... యిదిగో... యీ బాబే...’’ కొడుతున్న యింకో కానిస్టేబుల్‌ని చూపించబోయింది. మరుక్షణం ఆమె వొంటి మీద పిడిగుద్దుపడింది.‘‘అబ్బా...’’ అని నోటి మీద చెయ్యిపెట్టి చూసుకుని ‘‘సరిగ్గా కొట్టలేని- వాడివి, నువ్వేం పోలీసువయ్య?... చూడు రక్తమొస్తొంది’’కంగారుపడి ‘‘గట్టిగా అరవకే... పేరుకు తగ ్గట్టు మాయ కబుర్లు చెప్పకు. ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది వ్యాపారం...?’’ కర్కశంగా అడిగాడు కానిస్టేబుల్‌, గోముగా నవ్వి ‘‘నీకు తెలీదా? ఎందుకయ్యా యీ నాటకాలు?’’ అడిగింది మాయ. మళ్ళి వెంటనే ఆమె మీద లాఠి దెబ్బలు.కితకితలు పెట్టినట్టుగా నవ్వి ‘‘లేకపోతే...నెలరోజులకి ఒకసా రయినా నన్ను పట్టుకున్నట్టు పేపర్లో వస్తుంది. నన్ను ఎవరెవరు తీసికెళ్ళి వాడుకుంటారో తెలుసు. మళ్ళి యిక్కడికి తోసుకొచ్చి కొత్తగా ్ట అడుగుతారే....?’’‘‘ఇలా లాభంలేదే...నిన్ను...’’బయట గదిలో కూర్చుని యిదంతా చూస్తున్న ఎస్సై ఆనంద్‌ యిక ఆగలేక లోపలికి వచ్చి ‘‘ఇక... ఆపండి’’ అని అరిచాడు.కొట్టడం ఆపి ‘‘మీకు తెలీదు సార్‌ దీని గురించి. మీరు కొత్తగా వచ్చారు. ఎంత కొట్టినా ఎలా నవ్వుతొందో చూడండి...’’‘‘నాకన్నీ తెలుసు. అయినా ఎప్పుడూ యీ అమ్మాయి మాత్రమే దొరుకుతోందా? యింకెవరు లేరా?’’విజిల్‌ వేసి పెద్దగా నవ్వింది మాయ ‘‘బాగా అడిగారు ఎస్సైబాబు.

 దొరికారు... కాని ఎవరికి ఏం కావాలో చేరిపోయాయి’’ఆమె చెంప మీద కొట్టి ‘‘చూశారా సార్‌. ఎంత దొంగ...?’’ అందుకే దీన్ని సిఐగారు వదలద్దన్నారు సార్‌’’అసహనంగా చూసి అన్నాడు ఆనంద్‌ ‘‘అయితే మాత్రం కొట్టడం ఎందుకు? రేపు కోర్టుకు తీసికెళ్ళండి’’వంకరగా నవ్వి అంది లేడి కానిస్టేబుల్‌ ‘‘ఆ పనీ అయ్యింది సార్‌ ఒక్కసారి, దీని హోయలు చూసి మేజిస్ర్టేట్‌గారే కేసు కొట్టేసారు’’కిసుక్కున నవ్వి ‘‘నా హోయలు చూసి కాదు...ఆయనే...’’మాయ నోరు మూసి ‘‘చూశారా సార్‌... ఎంత తెగించిందో...’’ఇక అక్కడ నిలబడలేక విసురుగా బయటకు వచ్చాడు ఎస్సై ఆనంద్‌. అతని మనసుని ఎవరో మెలిపెట్టినట్టుగా వుంది.లోపల మళ్ళీ మెదలుపెట్టారు.‘‘ఊ...చెప్పవే...?’’ఒక్కసారిగా వాళ్ళిద్దరిని తోసి ‘‘మహా... ఏం చెప్పేది? ఆపండి డ్రామా యీసడింపుగా అంది.కోపమొచ్చింది యిద్దరికి ‘‘ఎంత మాట న్నావ్‌...’’ అని ముందుకు రాబోయారు ‘‘ఆగండి... డ్రామా కాకపోతే? కొత్తగా రేపు సిపి గారోస్తు న్నారు. మిగతా స్టేషన్లు కళకళలాడుతున్నాయి. మన స్టేషన్‌...ఒక దొంగా లేడు, ఒక్క రౌడీ వెధవాలేడు. బేవార్సుగా నేనొక్కత్తినే వున్నానుగా? తీసికొచ్చిపడేశారు.’’