ఈ బస్సు మన అందరిది. దీనిని పరిశుభ్రంగా వుంచుదాం’’ అక్షరాలు అందంగా వున్నాయ్.ముత్యాల్లా వున్నాయ్. ముచ్చటగా వున్నాయ్. ఆలోచనలే... వికారంగా, వికృతంగా, విపరీతంగా వున్నాయ్. ఎన్నన్నా చెప్పండి. సక్రమంగా మాత్రం లేవు.‘‘గురూ... ఈ బస్సు మనందరిదీ, అంతవరకూ మనకే అభ్యంతర మూ లేదు, కానీ... దీనిని పరిశుభ్రంగా వుంచుదాం అంటే!... అంటే మనందరం బస్సులుక్లీన్ చేసేవాళ్ళమనేగా అర్థం’’ మత్తుగాపలికిందో గొంతు.‘‘అవును గురూ... భలే చెప్పావ్. నువ్ చెప్పేవరకూ అసలా పాయింటే ఎవరికీ వెలగలేదు’’ మత్తు మాటలకు వంత పలికింది మరో గొంతు. ఆ రెండు గొంతులూ కలిసి మత్తుగా, పిచ్చిగా అలా అలా వాగిన దంతా వాడవాడలకూ పాకిపోయింది. మగతలో వున్న యువత అంతా ఒక్కటయ్యారు. అంతే... బస్సుల అద్దాలు ముక్కలు ముక్కలైపోయినై. ‘యువతను కించపరుస్తున్న వ్రాతలు’ అంటూ నినాదాల్తో బారులు తీరిన బస్సుల్ని ధ్వసం చేయసాగారు.సమన్వయ సంఘాలు వెలసినై. సలహా క మిటీలు పుట్టుకొచ్చినై. సంప్రదించేందుకు, సమాలోచనలు జరిపేటందుకు సహృదయులు ముందుకు వచ్చారు. యువతకు, భవితకు మధ్య సమన్వయం ఏర్పరచి సమస్య పరిష్కారానికి నడుం బిగించారు.తాత్కాలికంగా బస్సుల విధ్యంస ప్రక్రియను ప్రక్కన పెట్టేందుకు యువతని, బస్సుల్లో వ్రాతల్ని మార్చేందుకు యాజమాన్యాన్ని ఒప్పించారు సహృదయులు.
సుదీర్ఘ చర్చల అనంతరం ఇరువైపుల వారూ అనేకానేక ఆలోచనలయ్యాక-‘‘ఈ బస్సు మనందరిది. దీనిని పరిశుభ్రంగా వుంచుతాం’’ అని మార్చేందుకు నిర్ణయించారు. ఈ నిర్ణయం బాగుందని మెచ్చుకున్నారు మేధావులు. ‘‘అవును మరి బస్సుల్ని శుభ్రపరిచి నీట్‌గా వుంచేందుకు ఉద్యోగులున్నారు. అది వాళ్ళ డ్యూటీ. జీతాలు వాళ్ళకీనూ... బాధ్యతలు మనకూనా!’’ అంటూ తాము చేసిన ఘనకార్యాన్ని తామే సమర్థించుకుంది యువత.కొన్ని వందల బస్సులు దగ్ధం అయ్యాక మొత్తంమీద ఉద్యమం ఉపశమనం పొందింది. ఆవేశం చల్లారింది. అయినా కొన్ని చోట్ల తగలబడ్డ బస్సుల ఇనుప కమ్మీలు ఇంకా చల్లారలేదు. అక్కడక్కడ ఇంకా పొగలు వస్తూనే వున్నాయి‘‘స్త్రీలను గౌరవించటం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’’ బోర్డుమీది అక్షరాలను చదివిన ఓ సుమతి మదిలో ఆవేదన, ఆగ్రహం, అవమానం లోంచి పుట్టిన ఆక్రోశం, ఆక్రోశం నుంచీ పుట్టిన ఆవేశం.‘యత్ర నార్యస్తు పూజ్యంతే’ అన్న మన దే శంలో, మన రాష్ట్రంలో మహిళలకు ఇంతటి అవమానమా? దీన్ని ఉపేక్షించి, ఉదాసీనంగా ఉండి పోవటమా?... నో... నో... నో.‘‘ఎవరో కూర్చోనిస్తే మనం కూర్చోవటం ఏమిటి? ఒకరి దయా దాక్షిణ్యాలపైన ఆధారపడటం ఏమిటి? ఎవరైనా దయతలచి సీట్లో కూర్చోనివ్వటమా!’ ‘కూర్చోనిద్దాం’ అనే పద ప్రయోగమా మహిళ జాతినంతటినీ కించపరిచే విధంగా వుంది. మమ్మల్ని అవమాన పరిచేదిగా వుంది. ఇలాంటి వాటిని క్షమించకూడదు. ఇవి క్షంతవ్యం కాని నేరాలు, ఘోరాలు. ఇకపై ఇలాంటి రాతలు చెల్లవ్...