ఆ అమ్మాయి ఆఫీసర్ టేబుల్ ముందు కుర్చీ లాక్కొన్ని కూర్చొన్నది.కూర్చోమని చెప్పనిదే అట్లా కూర్చుంటే..ఆఫీసర్‌కు వరంగల్, గుంటూరు మిరపకాయ కలగలిపి నమిలినంత కోపం రావాలి.కాని రాలేదు.ఎందుకంటే... ఆ వచ్చినది అతని కూతురు.‘ఐస్ క్రీం తెప్పించనా ....కూల్‌డ్రింక్సా?’అంత వినయం, సౌమ్యం ఆఫీసర్ మొహంలో అరుదు.ఆఫీసులో డబుల్ అరుదు. ఎందుకంటే...అతను పోలీస్‌ఆఫీసర్. ఏ ప్రాంతమో అంత ముఖ్యం కాదు మన ప్రాంతం కాదనుకుంటే మంచిది.కరుకుతనం, గరుకుతనం అతని లక్షణాల్లో కొన్ని...ఆ లక్షణాల్లో కూతురును చూడగానే హుష్ కాకై ...కిటికీ అవతల చెట్ల మీద కూర్చున్నాయి.అమ్మాయి కోమలంగా, నాజూగ్గా ముట్టుకుంటే మాసిపోయే జాంపండు రంగులో ఉంది. చూపులు మాత్రం చురకత్తుల్లా ఉన్నాయి.‘ఐస్ క్రీం డార్లింగ్?’ ముద్దుగా అడిగాడు ఆఫీసర్.‘‘ఉహు...’’ అంది అమ్మాయి.‘కూల్ డ్రింక్స్?’‘‘ఉహు...ఉహు...ఉహు...’’మూడు సార్లు ఉహు... అనేసరికి కూతురు కోపం ఏ రేంజ్‌లో ఉందో పోలీస్ ఆఫీసర్‌కు అర్థమయింది. టైం చూసుకున్నాడు. పన్నెండు కాబోతున్నది.‘‘కాలేజీకి?..’’ అని అడిగాడు.‘‘వెళ్లాను...వచ్చాను...’’‘అరరే..ఫోన్ చేస్తే ... ఏం కావాలంటే అది క్షణాల్లో...’అదృష్టమంటే మంత్రుల సంతానం తరువాత ఆఫీసర్ల కొడుకులు, కూతుళ్లది..!‘డైరెక్ట్‌గా మాట్లాడాలనే వచ్చాను..’అసెంబ్లీ, పార్లమెంట్లలోని ప్రతిపక్షం కాదు గదా...ఈ ప్రతి పక్షం!.. ఫుల్ అటెన్షన్ లోకి వచ్చాడు ఆఫీసర్.‘ఎనీథింగ్ రాంగ్?’ అని అడిగాడు.‘ఎవ్రీథింగ్ రాంగ్... ’ అన్నది చిరుకోపంగా.‘ఓ మైగాడ్..ఎక్కడ...ఎక్కడ బేబీ?..’‘ఇక్కడే ఈ ఆఫీసులోనే...’‘ఈ ఆఫీసులోనా!!!’ గుండెలో అడవి బాంబు పడినట్లు అదిరిపడ్డాడు ఆఫీసర్.
‘ఈ ఆఫీస్‌లోనా!!’ నమ్మశక్యంకాక మళ్లీ అడిగాడు.‘‘ఎస్..మీ ఆఫీస్‌లోనే...మీ ట్రాఫిక్ సిబ్బంది ఒళ్ళు దగ్గర పెట్టుకొంటే మంచిది..’’అంతటి ఆఫీసర్‌ను... ఆ సిబ్బందిని హడల గొట్టే దమ్ము ఆయన కూతురు కనక ఆ అమ్మాయికి ఉంది మరి!...‘ఏమైంది బేబీ...దారిలో నిన్ను గుర్తు పట్టక మా సిబ్బంది పట్టుకున్నారా?.. స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నావా?.. ఏ కారు?..’‘‘ఇవ్వాళ కార్లో రాలేదు..’’‘‘వ్యాన్‌లో స్పీడ్‌గా వచ్చావా?’’‘‘ఇవ్వాళ వ్యాన్‌లో రాలేదు..’’‘‘సుమో...’’‘‘ఉహు...’’‘‘ఓహో క్వాలిస్‌లో వచ్చావా? ’’‘‘ఉహు...’’‘‘కొత్త మోడల్ స్విఫ్ట్‌లో వచ్చావా..’’‘‘ఇవ్వాళ ఫోర్‌వీలర్లు బయటికి తీయలేదు’’‘‘ఓహో హోండా మీద వస్తున్నావా?’’‘‘కాదు నడిచి...’’‘‘వాట్!!’’ ఆశ్చర్యంతో అంతేసి ఆఫీసర్ దళసరి కనుబొమ్మలు నల్ల దారాల్లా ముడుచుకుపోయాయి.‘‘నడిచి రావడేమమిటి బేబీ?..’’‘‘నడిచి రాకపోతే ఆఫీస్‌లోకి బండి మీద దూసుకురానా?’’‘‘ఓహో...’’ అప్పుడర్థమయింది ఆఫీసర్‌కు...‘‘వాట్ ఏ జోక్ ... వాట్ ఏ జోక్...’’ అని కూతురు జోకుకు మురిసిపోయాడు ఆఫీసర్.‘‘సీరియస్‌గా అడుగుతున్నా... మీ సిబ్బందిని కంట్రోల్లో పెడతారా లేదా?...’’అంతలో బయట అలజడి వినిపించింది.ఆఫీసర్ బెల్ మోగించాడు.‘‘ఎస్ సర్... ’’ అంటూ బుల్లెట్‌లా దూసుకు వచ్చాడు కానిస్టేబుల్.‘‘కోనై ఓ..’’‘‘పబ్లికై సర్..’’‘‘ఏంటట...’’‘‘చాలాన్లు కట్టేదానికి వస్తారు కదా సార్... ఫుల్‌గా జరిమానాలు వేస్తున్నామట!...’’‘‘ఆవాజ్ నై ఆనా... అల్లరి వినిపించవద్దు...’’ కిటికీలు పూర్తిగా మూసేసి ఏ.సి ఆన్ చేశాడు కానిస్టేబుల్.