అర్ధరాత్రి అందునా అమావాస్య నాటి రాత్రి. ఆకాశం మేఘావృతమై వుంది. ఉండుండి మెరుపులు మెరుస్తున్నాయి. ఏ నిమిషం లోనైనా వర్షం వచ్చేలా వుంది. అట్లాంటి నిశీధి రాత్రివేళ నిర్భయంగా వేగంగా కారు డ్రయివ్‌ చేస్తున్నాడు కృపాల్‌. వారం రోజులుగా నిద్ర లేని అతడి కళ్లు చీకట్లో చింత నిప్పుల్లా మెరుస్తున్నాయి. కంటిమీదకి కునుకు రానివ్వకుండా, కనురెప్పలు వాలకుండా మొండి పట్టుదలతో దవడలు బిగించి ఏకాగ్రతతో డ్రైవ్‌ చేస్తున్నాడు కృపాల్‌. కారు వెనక సీట్లో కూర్చుని రోడ్డు వైపు తీక్షణంగా చూస్తున్న డిటెక్టివ్‌ నర్సన్‌ ఒకసారి అస్థిమితంగా అటూ యిటూ కదిలి రిస్ట్‌వాచిలో టైం చూసుకున్నాడు.అర్ధరాత్రి గం. 12.25 ని. సూచించింది రిస్ట్‌ వాచి. ఆ సమయంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ హైవే మీద వేగంగా దూసుకుపోతోంది కృపాల్‌ డ్రైవ్‌ చేస్తున్న కారు. రోడ్డు నిర్మానుష్యంగా వుంది. అప్పుడప్పుడూ ఒకటి, రెండు వాహనాలు ఎదురొస్తున్నాయి తప్ప రోడ్డు మీద ఎలాంటి సమాచారం లేదు.సరిగ్గా వారం క్రితం. భారత ప్రభుత్వం ఆహ్వానం అందుకుని ఢిల్లీ వెళ్లాడు నర్సన్‌. 

దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో ఏక కాలంలో అల్లర్లు సృష్టించడానికి పథకం వేసిన శత్రుగూఢచారిని రాత్రింబగళ్లు నీడలా వెంటాడి పట్టుకుని బంధించి, ఆ భయంకరమైన కుట్రని భగ్నం చేశాడు నర్సన్‌. ఆ ప్రయత్నంలో ఒక రాత్రి నర్సన్‌ కృపాల్‌ చావుకి బెత్తెడు దూరం దాకా వెళ్లి, అత్యంత సమయ స్ఫూర్తితో తప్పించుకుని ప్రాణాలతో బైట పడుతూ - అదే సమయంలో ఆ శతృగూఢచారిని ప్రాణాలతో బంధించి ప్రభుత్వానికి అప్పగించారు.సరిగ్గా అప్పుడే... ఆ క్షణంలోనే ఢిల్లీలో వున్న నర్సన్‌కి ఫోనొచ్చింది. అతనికి బాగా పరిచయం వున్న శ్రీమంతుడు ఒకాయన మాట్లాడుతూ ‘‘నర్సన్‌ గారూ! నేను ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నాను. మీ సహాయం కోరుతున్నాను. దయచేసి వెంటనే బయల్దేరి రండి. ఎట్‌ ఎనీ కాస్ట్‌. రేపు పొద్దుటికల్లా మీరు నా పక్కనుండాలి. ప్లీజ్‌...’’ అని అర్ధించాడు.